పాపం బన్నీకి అలా హ్యాండిచ్చారు

Update: 2015-04-10 11:30 GMT
'మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు తీసుకోండి సార్‌. స్క్రిప్ట్‌ ఎంత లేటైనా కూడా నేను వెయిట్‌ చేస్తానన్నాడు బన్నీ'' అంటూ స్వయంగా త్రివిక్రమ్‌ చెప్పుకొచ్చాడు. అయితే అన్నేసి రోజులు వెయిట్‌ చేయించి కూడా మనోడు ''సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి'' కోసం సరైన స్క్రిప్టును రాయలేదేంటి అంటూ సినీ లవర్స్‌ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. డైరక్టర్లకు ఫుల్‌ ఫ్రీడం ఇచ్చే అతి కొద్దిమంది తెలుగు హీరోల్లో బన్నీ ఒక్కడు. ఒక్కసారి కథకు ఓకె చెబితే, ఇంక సాంతం దర్శకుడి మీదనే వదిలేస్తాడు. అయినా సరే ఎక్కడ పొరపాటు జరిగింది మరి?

నిజానికి క్యారెక్టరైజేషన్‌ను సింపుల్‌గా, ఓ డబ్బున్న కుర్రాడిలా పెడదామనకున్న త్రివిక్రమ్‌, ఏకంగా సినిమానే సింపుల్‌గా చేసేశాడు. కొందరు విమర్శిస్తున్నట్లు, హిట్టొస్తే హీరోని పొగిడి, ఫ్లాపొస్తే డైరక్టర్‌ను తిడతారా అనే కామెంట్‌కు ఇక్కడ అర్ధమే లేదు. ఇప్పుడు ఈగ సినిమా హిట్టయినందుకు నాని కి పేరొచ్చిందా? లేదుగా రాజమౌళికే పేరొచ్చింది. ఇక్కడ ఎవరి ప్రతిభ ఎక్కువ కనిపిస్తే వారికే పేరొస్తుంది. అదే 'అత్తారింటికి దారేది' ఎవరైనా తరుణ్‌ వంటి కుర్రహీరోతో తీస్తే ఇండస్ట్రీ హిట్‌ అవుతుందా? అవ్వదు. అక్కడ పవన్‌ ఉన్నాడు కాబట్టే అంత క్రేజ్‌.

ఇక సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి సినిమా విషయానికొస్తే.. డబ్బున్న ఫ్యామిలీ రోడ్డున పడటం, ఫ్యామిలీలో ఒకరు కష్టపడి సంపాదించడం అనేది రొటీన్‌ స్టోరీ. రొటీన్‌లో పరమరొటీన్‌ ఏంటంటే.. తనతో పెళ్ళి వద్దనుకున్న హీరోయిన్‌ పెళ్ళికి హీరో వెళ్ళడం, ఒక విలన్‌కు బాగా నచ్చేసి తన చెల్లెలను ఇచ్చి పెళ్ళిచేయాలనుకోవడం.. ఇవన్నీ విపరీతంగా వాడేయబడిన పాత తరం తెలుగు సినిమా వంటకాలు. రుచీ ఉండదు, పచీ ఉండదు. మరి జులాయ్‌ను కొత్తగా, అత్తారింటికి దారేదిని వెరైటీగా తీసిన త్రివిక్రమ్‌.. సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి విషయంలో ఎందుకు కొత్తగా ఆలోచించలేదు? పైగా సెకండాఫ్‌ మొత్తం ఏకంగా శ్రీను వైట్ల స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌ కామెడీలా తయారైంది. ముమ్మాటికీ ఇక్కడ దర్శకుడినే తప్పుపట్టాల్సిందే.

ఇక పంచ్‌ డైలాగులు ఏమైనా పేలాయా అంటే మాత్రం.. అవన్నీ రామాయణం మీద వేసిన సెటైర్లే. రాముడితో సీత కూడా రొమాన్స్‌ చేసే ఉంటుందిగా అని త్రివిక్రమ్‌ ఓ టివి షోలో చెప్పినట్లే, సినిమాలో కూడా అదే చూపించాడు. కాని రాముడు రొమాన్స్‌, కామెడీలనే చేస్తే.. మరి రాజ్యపాలన, శిష్ఠరక్షణ, దుష్ఠ శిక్షణ చేసేదెప్పుడు త్రివిక్రమ్‌ సార్‌? పైగా ఓవర్‌ స్టార్‌ క్యాస్ట్‌ ఒకటి. అసలు అంతమంది సినిమాలో అవసరమేటండీ?

ఇకపోతే గోల్డెన్‌ గాళ్‌గా వరుసగా మహేష్‌, ఎన్టీఆర్‌, నాగచైతన్య మొదలగు హీరోలకు హిట్లు ఇచ్చిన సమంత, గత సంవత్సరం ఐరన్‌ గాళ్‌గా తయారైంది. రభస, అంజాన్‌ వంటి ఫ్లాపులతో షాకిచ్చేసింది. పోనివ్‌ ఈ సినిమాతోనైనా మళ్ళీ పాత సమంతను చూపిస్తుంది అనుకుంటే, సేమ్‌ రిపీట్‌. అయితే సెంటిమెంట్‌ పేరు చెప్పి ఫీలవ్వడమే కాని, పాపం సమంత మాత్రం ఏం చేస్తుందిలే. ఇకపోతే సినిమాకు దెబ్బకొట్టిన వ్యక్తుల్లో త్రివిక్రమ్‌ తరువత దేవిశ్రీప్రసాదే. పాటలు విని, సినిమాలో బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ విన్నాక.. ఇక దేవి ఫెయిల్యూర్‌ గురించి పేజీలు పేజీలు చెప్పక్కర్లేదు. అలా అందరూ బన్నీకి హ్యాండిచ్చేసారు.



Tags:    

Similar News