టాలీవుడ్ నిర్మాతలతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లైవ్ చాట్

Update: 2020-05-23 06:30 GMT
టాలీవుడ్ పై అందరి దృష్టి నెలకొంది. ఎన్నో పెద్ద సినిమాలు ఆగిపోవడం.. సినీ కార్మికులంతా పస్తులు ఉంటుండడం.. అన్నింటికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఈ రంగంపై పడడంతో ఆందోళన మొదలైంది. చిత్ర పరిశ్రమను పునరుద్దరించడానికి మెగా స్టార్ చిరంజీవి ఇతర సినీ పెద్దలు నిన్న సీఎం కేసీఆర్ ను కలిసి చర్చించారు. పలు అనుమతులు పొందారు.

ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి పలువురు టాలీవుడ్ అగ్రనిర్మాతలతో ఫేస్ బుక్ లైవ్ లోమాట్లాడారు. సినిమా నిర్మాణంలో కష్టాలు.. ఓటీటీల వల్ల సినిమా ఇండస్ట్రీకి కలుగుతున్న నష్టాలు.. డైరెక్టుగా సినిమా ఓటీటీలకు వెళితే వేలమంది సినీ కార్మికులు, నటులకు నష్టం అని నిర్మాతలు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు.

కిషన్ రెడ్డితో మీటింగ్ లో నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్, వివేక్, మైత్రీ మూవీ మేకర్స్  నిర్మాతలు లాక్ డౌన్ తో ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర మంత్రి దృష్టికి సమస్యలు తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా సీనియర్ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కీలక విషయం సూచించారు. ‘ఓటీటీలో సెక్స్ న్యూడిటీ సహా అసభ్యంగా చిత్రాలు తీసి అందరికీ సెన్సార్ లేకుండా చూపిస్తున్నారని.. దాన్నే జనాలు ఎక్కువగా చూస్తున్నారని.. తాము కొంచెం ముద్దు సీన్ పెట్టినా సెన్సార్ వాళ్లు కట్ చేస్తున్నారని.. ఓటీటీల వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటోందని దీన్ని నియంత్రించాలని ’ సురేష్ బాబు కోరారు. ఇక ప్రాంతీయ జీఎస్టీలు తేవాలని.. చిన్న సినిమా పరిశ్రమలకు జీఎస్టీ తగ్గించాలని కోరారు. బాలీవుడ్ కు టాలీవుడ్ కు ఒకే జీఎస్టీ  పెట్టడం వల్ల నష్టపోతున్నామన్నారు.

దీనికి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ‘ఇది తెలుగు సినిమా ఒక్కరి సమస్యే కాదని.. దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చాయని.. త్వరలోనే కేంద్రం ఈ ఓటీటీలపై కఠిన నిర్ణయం తీసుకుంటుందని’ కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. జీఎస్టీపై ఆలోచిస్తామన్నారు.
Tags:    

Similar News