అపోలో హాస్పిటల్స్.. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ బ్రాండ్ గా ఎదిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతాప్ రెడ్డి పేదలకు వైద్యసేవలు అందించేందుకు స్థాపించిన ఒక్క ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ఎందరికో ప్రాణదానం చేస్తోంది. అంతటి అపోలో హాస్పిటల్స్ కు రూపశిల్పి అయిన ప్రతాప్ రెడ్డి గురించి ఆయన మనమరాలు.. రాంచరణ్ భార్య ఉపాసన ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కోడలు అయ్యాక ఉపాసన చాలా పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అంటు మెగా ఫ్యామిలీ తరఫున సేవకార్యక్రమాలు నిర్వహిస్తూనే.. ఇటు తన తాత ప్రతాప్ రెడ్డి స్థాపించిన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను కూడా నిర్వర్తిస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడు తన పర్సనల్, ఉపయోగకరమైన విషయాలను పంచుకునే ఉపాసన తాజాగా తన తాత కల ఇదేనంటూ ఓ వీడియోను షేర్ చేశారు.
తన తాత పుట్టిన అర్నకొండ నుంచి అపోలో హాస్పిటల్స్ ఇంత ఎత్తుకు ఎదగడం వరకూ ప్రతాప్ రెడ్డి కన్న కలలు.. ఆయన భావాలు ఎలా కార్యరూపం దాల్చాయన్నది ఉపాసన ఆ వీడియోలో చూపించారు. సేవ చేయాలనే ఉద్దేశంతో తాత కన్న కలలు నేడు నిజమయ్యాయని ఆమె పేర్కొన్నారు. ప్రతాప్ రెడ్డి వాయిస్ తో మొదలయ్యే ఆ వీడియో ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.