అలాంటి మాస్ బొమ్మ ప‌డాల్సిందేనా?

Update: 2022-08-03 12:52 GMT
టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌స్తుతం చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. పాన్ ఇండియా సినిమాలు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించి రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టినా ఆ త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోతున్నాయి. మ‌రీ ముఖ్యంగా స్టార్ లు న‌టించిన సినిమాలు ఏ ఒక్క‌టి కూడా ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా రాణించ‌లేక‌పోతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ వ‌రుస ఫ్లాపులు అవుతూ నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ని అందిస్తున్నాయి.

RRR, కేజీఎఫ్ 2 త‌రువాత వ‌చ్చిన సినిమాల్లో అత్య‌ధికంగా ఫ్లాపులు, డిజాస్ట‌ర్ లే వుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం ఆయా సినిమాల్లో స‌రైన కంటెంట్ లేక‌పోవ‌డ‌మే. జూలై నెల ఇందుకు ప్ర‌ధాన ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. దీంతో ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రావ‌డం మానేశారు. కంటెంట్ లేని సినిమాల‌ని చూడ‌టం కంటే థియేట‌ర్ల‌కు దూరంగా వుండ‌ట‌మే మంచిద‌ని డిసైడ్ అయ్యారు. అప్ప‌టి నుంచి థియేట‌ర్ల ముఖం చూడ‌టం లేదు.

ఈ కార‌ణంగానే ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన సినిమాలు రెండు వారాల‌కు మించి థియేట‌ర్ల‌లో నిల‌బ‌డ‌లేక ఓటీటీలోకి వెళ్లిపోయాయి. క‌రోనా త‌రువాత ప‌రిస్థితుల్లో మార్పులు రావ‌డం మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో థియేట‌ర్ల రీఓపెన్ అయినా యాభై శాతం ఆక్యుపెన్సీతోనే ర‌న్ చేశారు. ప్రేక్ష‌కులు పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తే థియేట‌ర్ల‌కు వ‌స్తారా? ఇండ‌స్ట్రీ మ‌నుగడ ప్ర‌శ్నార్త‌కంగా మార‌బోతోందా? అంటూ చాలా మంది ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భాయందోళ‌న‌కు గుర‌య్యారు.

ఆ భ‌యాల‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేస్తూ నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌`.. మాస్ మహారాజా ర‌వితేజ న‌టించిన `క్రాక్‌` సినిమాలు బ్లాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ లు నిలిచి ఇండ‌స్ట్రీకి అఖండ విజ‌యాల‌ని అందించ‌డ‌మే కాకుండా కొండ‌త భ‌రోసానిచ్చాయి. మాస్ బొమ్మ ప‌డాలే కానీ జ‌నాలు థియేట‌ర్ల‌కు ఎందుకు రారు అని ఈ రెండు సినిమాలు మ‌రోసారి నిరూపించి ఇండ‌స్ట్రీకి స‌రికొత్త ఉత్సాహాన్ని అందించాయి. యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ ఈ సినిమాలు మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు లాభాల్నితెచ్చిపెట్టాయి.  

తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీకి మ‌ళ్లీ అఖండ‌, క్రాక్ లాంటి కంటెంట్ వున్న మాస్ బొమ్మ‌లు కావాల‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అఖండ వ‌రుస ఫ్లాపుల్లో వున్న బాల‌య్య‌ని మ‌ళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. `క్రాక్` కూడా అదే త‌ర‌హాలో ర‌వితేజ‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఈ ఇద్ద‌రి వ‌ల్ల ఇండ‌స్ట్రీ మ‌ళ్లీ గాడిలో ప‌డింది. టికెట్ రేట్లు ఏపీలో నామ‌మాత్రంగా వున్న స‌మ‌యంలో అఖండ అఖండ‌ విజ‌యాన్ని సాధించిన స‌రికొత్త‌ ఊపిరులూదింది. బి,సి సెంట‌ర్ల‌లో ఈ సినిమా దుమ్మురేపింద‌ని చెప్పొచ్చు.

 జై బాల‌య్య‌, మాస్ మ‌హారాజా అంటూ థియేట‌ర్లు మారుమోగిపోయాయి. ఇప్ప‌డు ఇండ‌స్ట్రీకి ఇలాంటి సినిమాలు కావాలంటున్నారు. మాస్ బొమ్మ ప‌డితే ఆ ఊపు థియేట‌ర్ల‌లో వేరేలా వుంటుంద‌ని చెబుతున్నారు. అఖండ‌, క్రాక్ ల మ్యాజిక్ ని ఆగ‌స్టు 5న విడుద‌ల కానున్న‌ క‌ల్యాణ్ రామ్ బింబిసారి, దుల్క‌ర్ `సీతారామం` రీపీట్ చేస్తాయా అన్న‌ది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News