బాలయ్యతోనూ అదే కామెడీ అంటే కష్టమే..!

Update: 2022-11-14 15:30 GMT
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. 'పటాస్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్.. వినోదానికి పెద్ద పీట వేస్తూ తన మార్క్ కమర్షియల్ చిత్రాలను అందిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే 'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' 'ఎఫ్ 2' 'సరిలేరు నీకెవ్వరు' 'ఎఫ్ 3' వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు సాధించారు.

డబుల్ హ్యాట్రిక్ ని ఖాతాలో వేసుకున్న అనిల్.. ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణతో సినిమా చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఇది బాలయ్యకు 108వ చిత్రం. NBK108 అనే వర్కింగ్ టైటిల్ తో ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపినప్పటికీ.. అతని చిత్రాలపై సోషల్ మీడియాలో ఓ వర్గం ఆడియన్స్ నుంచి ఎప్పుడూ ట్రోలింగ్ వస్తుంటుంది. కంటెంట్ కు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎంటర్టైన్మెంట్  పేరుతో క్రిన్జ్ కామెడీని చూపిస్తుంటారని ఆరోపిస్తుంటారు.

అందుకే అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో చేయబోయే సినిమా ఎలా ఉంటుందో అని నందమూరి అభిమానులు ఆలోచిస్తున్నారు. ఈసారి కూడా దర్శకుడు తన మార్క్ కామెడీతోనే వస్తారా? నటసింహం మాస్ ఇమేజ్ కు అది సెట్ అవుతుందా లేదా అని సందేహిస్తున్నారు.  

నిజానికి కామెడీ విషయంలో ఆరోపణలు వచ్చినా.. మాస్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు అనిపించుకున్నాడు అనిల్‌. ఇప్పుడు మాస్ గాడ్ బాలయ్య కోసం ఓ విభిన్నమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ స్క్రిప్ట్‌ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. తన మార్క్ కామెడీ మోతాదుని తగ్గించి.. బాలయ్య స్థాయి వినోదాన్ని అందించబోతున్నారని టాక్.

NBK108 సినిమాలో బాలకృష్ణ ను ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో చూపించబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇది తండ్రీ కూతురు మధ్య నడిచే కథ అని.. ఇందులో ఆయన 50 ఏళ్ల వయసున్న తండ్రి పాత్రలో కనిపిస్తారని దర్శకుడు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సినిమా మొత్తం బాలయ్య క్యారెక్టరైజేషన్ మీద నడుస్తుందని.. ఇప్పటివరకు బాలయ్యను ఎవ్వరూ చూపించని కోణంలో ఆవిష్కరించబోతున్నట్లు పేర్కొన్నారు. బాలకృష్ణ స్టైల్ - మాస్ - డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. అయినప్పటికీ ఇదొక కొత్త ప్రయోగమని.. ఇది తన కెరీర్ బెస్ట్ వర్క్ గా నిలిచిపోతుందని అనిల్ రావిపూడి తెలిపారు.

ప్రస్తుతం అనిల్ పూర్తిగా NBK108 స్క్రిప్ట్ మీదనే పని చేస్తున్నారు. ఈసారి తన శైలి నుంచి కాస్త బయటకు వచ్చి పూర్తిగా భిన్నమైన వినోదాత్మక చిత్రాన్ని అందిస్తారని అందరూ భావిస్తున్నారు. అలా కాకుండా తన గత చిత్రాల మాదిరిగానే రూపొందిస్తే మాత్రం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. మరి 'బాలయ్య - అనిల్' కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.

కాగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుందని సమాచారం.  రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News