'ఉద్య‌మ‌సింహం' రిలీజ్ ఆపండి: వీహెచ్‌

Update: 2019-03-29 04:34 GMT
ఎన్టీఆర్.. వైయ‌స్సార్.. థాక్రే.. మ‌న్మోహ‌న్.. మోదీ .. బ‌యోపిక్ ఏదైనా వివాదాలు మాత్రం త‌ప్ప‌నిస‌రి అయ్యాయి. ఆయా సినిమాల రిలీజ్ ల ముంగిట ప్ర‌త్యర్థి నాయ‌కులు రిలీజ్ ఆపాలంటూ నిర‌స‌న‌లు తెలియ‌జేశారు. కోర్టులు - కేసులు అంటూ బోలెడంత రుబాబ్ చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. తాజ‌గా ఇదే హీట్ ని ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ - మోదీ బ‌యోపిక్ ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు ఇదే కేటగిరీలో చేరింది కేసీఆర్ బ‌యోపిక్ గా చెబుతున్న‌ `ఉద్య‌మ సింహం`. వివ‌రాల్లోకి వెళితే..

ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కుతున్న వేళ బ‌యోపిక్‌ల హ‌డావిడి మ‌రింత హీట్‌ పుట్టిస్తోంది. బాలీవుడ్‌ లో మోదీ బ‌యోపిక్‌ - టాలీవుడ్‌ లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ - కేసీఆర్‌ లపై బ‌యోపిక్‌ లు సంచ‌ల‌నంగా మారాయి. దీంతో ఈ చిత్రాల‌ను ఎన్నిక‌లు పూర్త‌య్యే వ‌ర‌కు నిలిపివేయాల‌ని ప్ర‌జా సంఘాలు - రాజ‌కీయ నేత‌లు స‌వాల్ చేస్తున్నారు. ఎన్టీఆర్  వైస్రాయ్ కుట్రోదంతం నేప‌థ్యంలో రామ్‌ గోపాల్‌ వ‌ర్మ రూపొందించిన చిత్రం `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`. ఈ చిత్రాన్ని ఏపీలో విడుద‌ల చేయ‌రాదంటూ మంగ‌ళ‌గిరి కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా శుక్ర‌వారం విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని ఏపీలో నిలిపివేశారు. దీనిపై ద‌ర్శ‌కుడు రామ్‌ గోపాల్‌ వ‌ర్మ సుప్రీమ్ కోర్టును ఆశ్ర‌యించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఇక నైజాం - ఓవ‌ర్సీస్ లో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజైంది.

ఇదిలా వుండ‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌ రావు జీవిత క‌థ ఆధారంగా రూపొందిన  `ఉద్య‌మ‌సింహం` మూవీ విడుద‌ల‌ను కూడా నిలిపేయాలంటూ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విజ్ఞ‌ప్తి చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ సినిమా కేసీఆర్‌ పై తీసినా ఆ కుటుంబం నుంచి చిత్ర బృందం ఎలాంటి అనుమ‌తులు తీసుకోలేదు. పైగా ఈ చిత్రానికి ట్రేడ్ స‌ర్కిల్స్‌ లో అస‌లు అంత క్రేజు లేనే లేదు. అయినా ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌కూడ‌దంటూ వీహెచ్ కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోర‌డంతో ఒక్క‌సారిగా `ఉద్య‌మ‌సింహం` వార్త‌ల్లో నిలుస్తోంది. `అర్జున్‌ రెడ్డి` స‌మ‌యంలోనూ వీహెచ్ హ‌డావిడి చేసి ఆ చిత్రానికి మ‌రింత హైప్‌ ని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఉద్య‌మ సింహం చిత్రానికి అలానే హైప్ తెచ్చే ప్ర‌య‌త్న‌మేనా ఇది?  వేచి చూడాలి.
   

Tags:    

Similar News