నక్సలైట్ లుక్ తో రెచ్చిపోయిన వర్మ!

Update: 2021-12-27 03:03 GMT
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏం మాట్లాడతాడో .. ఏ విషయాన్ని గురించి ఎలా స్పందిస్తాడో ఆయనకే తెలియదు. ఆయన విపరీత ధోరణుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేసేవారు ఎంతమంది ఉంటారో, ఆయన పద్ధతులకు మద్దతును ప్రకటించేవారు అంతే మంది ఉంటారు. ఒకప్పుడు వర్మ నుంచి మంచి మంచి సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించాయి. మొదటి సినిమా 'శివ'తోనే కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన వారాయన. ఇప్పటికీ ఆ సినిమాను గురించి మాట్లాడుకుంటూ ఉన్నారంటేనే ఆయన టాలెంట్ ఎలాంటిదనేది అర్థం చేసుకోవచ్చు.

మాఫియా సినిమాలు తీయాలన్నా .. దెయ్యం సినిమాలు తీయాలన్నా వర్మ తరువాతనే అనే పేరును తెచ్చుకున్నాడు. తెలుగు తెరపై రొమాన్స్ ను హద్దులు దాటించిన ఘనత కూడా ఆయనకే చెందుతుంది. ఆ తరువాత వర్మ యథార్థ సంఘటనల ఆధారంగా కథలను అల్లుకోవడం మొదలుపెట్టారు. టైటిల్ దగ్గర నుంచి సినిమా విడుదలయ్యేవరకూ అన్నీ అంశాల చుట్టూ వివాదాలు అలుముకునేలా .. అదే పెద్ద పబ్లిసిటీగా మారేలా ఆయన చూసుకునేవారు. అలా నిజ జీవిత కథలతో ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలకి కూడా ఆదరణ తగ్గుతూ వెళుతోంది.

తాజాగా ఆయన 'కొండా మురళి' జీవితకథను 'కొండా' టైటిల్ తో రూపొందిస్తున్నారు. కొండా మురళి జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు .. అనూహ్యమైన మలుపులు ఉన్నాయనీ, అవన్నీ విన్న తరువాతనే ఆయన జీవితచరిత్రను సినిమాగా తీయాలనే ఆలోచనకి తాను వచ్చానని వర్మ చెప్పారు. ఈ సినిమాలో ఆదిత్ అరుణ్ .. ఇర్రా మోర్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ హనుమకొండలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసింది.

కేక్ కట్ చేసే కార్యక్రమానికి కొండా మురళి దంపతులు కూడా వచ్చారు. కథా నేపథ్యానికి తగినట్టుగా వర్మ నక్సలైట్ గెటప్ లో అక్కడికి వచ్చారు. చేతిలో తల్వార్ ను ధరించి వచ్చిన ఆయన, ఒక్కసారిగా పూనకాలు వచ్చినట్టుగా కేక్ ను ముక్కలుగా నరుకుతూ విజృభించారు. తల్వార్ కి అంటిన కేక్ ను నాలుకతో నాకేసి, మళ్లీ అదే తల్వార్ తో కేక్ ను ఇష్టం వచ్చినట్టుగా నరికారు. చుట్టూ ఉన్నవారు అంతమంచి కేక్ ఆగమైపోతుంటే బాధపడితే బాగుండదని చెప్పేసి, చప్పట్లు కొట్టేశారు. ఒక దర్శకుడిగా ఆయన 'కొండా' సినిమాలో ఏం చూపించబోతున్నారో తెలియదు గానీ, కేక్ మీద మాత్రం వీరలెవెల్లో విరుచుకుపడుతూ తన ప్రతాపం చూపించారు.
Tags:    

Similar News