'మెగా' గోదావరి చేసేసారే

Update: 2018-02-03 05:55 GMT
మెగా హీరోల సినిమాలు ఒకే రోజు క్లాష్ కాకుండా మధ్యవర్తులు చేసిన మంత్రాంగం ఎట్టకేలకు పని చేసి ఇంటెలిజెంట్ కోసం తొలిప్రేమ ఒక రోజు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. కాని రెండింటి మధ్య గ్యాప్ కేవలం 24 గంటలే కాబట్టి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అనే కామెంట్స్ విన్పిస్తునప్పటికి దిల్ రాజు చెప్పినట్టు మెగా ఫాన్స్ ఏది చూడాలి అన్న కన్ఫ్యూజన్ కి లోను కాకుండా ఉపయోగపడుతుంది అన్నది మాత్రం నిజం. ఇక ప్రమోషన్ విషయానికి వస్తే రెండు సినిమా యూనిట్లు ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. సరిగ్గా వారం రోజులు మాత్రమే టైం ఉండటంతో స్పీడ్ పెంచారు.  ఈ పోటీ కాకతాళీయంగా వేదికలో కూడా ఉండటం ఇక్కడ అసలు హై లైట్. ఈ రోజు తొలిప్రేమ ప్రీ రిలీజ్ ఫంక్షన్ భీమవరంలోని ఎస్ ఆర్కెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో జరగనుండగా రేపు ఇంటెలిజెంట్ వేడుక రాజమండ్రిలో జరగబోతోంది.

ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఇలాంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ అన్ని హైదరాబాద్ లో చేయటం రివాజు. రాష్ట్రం విడిపోయాక వైజాగ్ - గుంటూర్ - విజయవాడలో కూడా చేస్తున్నారు. కాని ఇలా తటస్థ వేదికలపై చేయటం మాత్రం చాలా అరుదు. వరుణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో సందడి చేయనుండగా సాయి ధరం తేజ్ తూర్పు గోదావరి జిల్లాను ఎంచుకున్నాడు. ఇలా ఇద్దరు మెగా హీరోలు గోదావరి సైడ్ ఎందుకు ఇంత ప్రత్యేకంగా దృష్టి సారించారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం అతిధిగా ఎవరు వస్తున్నారు అనేది. ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవిని పిలిస్తే రాని ఫంక్షన్ ఏది లేదు. ఈ నేపధ్యంలో చిరుని వీటికి పిలిచారా లేదా అనేది కూడా కీలకంగా మారింది. ఒకదానికి వచ్చి మరొకదానికి రాకపోతే బాగోదు. ఒకరు తమ్ముడి వారుసుడు. మరొకరు తోబుట్టువు బిడ్డ. కాదనలేరు. ఎందుకొచ్చిన ఇబ్బంది అని రెండూ వద్దనుకుంటారా చూడాలి. మొన్నే రామ్ చరణ్ రంగస్థలం కోసం హడావిడి చేసి వెళ్తే ఇప్పుడు తమ్ముడు - బావా చేయబోతున్నారు. చూస్తుంటే మెగా గోదావరి ప్లాన్ ఏదో ఉన్నట్టుంది.
Tags:    

Similar News