వెంకీ - రానా అభిమానులకు విజ్ఞప్తి

Update: 2018-09-09 06:27 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌ ఆరంభం నుండి ఎలాంటి విభేదాల్లో తలదూర్చకుండా - అందరికి సమాన దూరంలో ఉంటూ - అందరితో కలిసి పోతూ వివాదాలకు అసలు చోటు లేకుండా కెరీర్‌ లో ముందుకు వెళ్తున్నాడు. ఇక రాజకీయ పార్టీలకు కూడా వెంకటేష్‌ సమాన దూరం పాటిస్తూ వస్తున్నాడు. గతంలో రామానాయుడు రాజకీయాల్లో ఉన్నప్పటికి ప్రస్తుతం మాత్రం వెంకటేష్‌ మరియు సురేష్‌ బాబులు పొలిటికల్‌ పార్టీలకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి సమయంలో కొందరు వెంకటేష్‌ మరియు రానాలు ఒక పార్టీకి మద్దతుగా ఉంటున్నారు అంటూ ప్రచారం చేస్తున్నారట.

సోషల్‌ మీడియాలో వెంకటేష్‌ మరియు రానాల గురించి జరుగుతున్న ప్రచారంను ఏపీ స్టేట్‌ వైడ్‌ వెంకటేష్‌ మరియు రానా ఫ్యాన్స్‌ అభిమాన సంఘం నాయకులు తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. వెంకీ - రానాల అభిమానులకు అభిమాన సంఘం నాయకులు ఒక బహిరంగ లేఖను రాయడం జరిగింది. ఆ లేఖలో.. మన హీరోలు పలానా రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వండి అంటూ ఎప్పుడు చెప్పలేదు, మనం వెంకటేష్‌ - రానాల అభిమానులుగా సంతోషంగా ఉన్నాం. అయితే రాజకీయం పరంగా ఎవరి ఇష్టం వారిది. ఎవరికి ఇష్టం అయిన పార్టీలో వారు తిరుగుతూ వెంకటేష్‌ - రానాలను అభిమానించొచ్చు. కాని కొందరు మాత్రం రాజకీయ పార్టీల బ్యానర్‌ లు మరియు ప్లెక్సీల్లో వెంకటేష్‌ - రానాల ఫొటోలు పెడుతున్నారు. అలా ఫొటోలు వాడటం లేదా పేరు పెట్టడం తప్పు. మనం అంతా కూడా విక్టరీ అభిమానులం. ఒక పార్టీ గురించి మనం విడిపోకూడదు. రాజకీయల విషయంలో ఎవరి వ్యక్తిగతం వారిది - వారు ఇష్టమైన పార్టీల్లో ఉండవచ్చు కాని పార్టీలకు మన హీరోలను వాడకూడదు. దయచేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే రాజకీయ పోస్ట్‌ లకు మన హీరోల ఫొటోలు - పేర్లు వాడొద్దు అంటూ అభిమాన సంఘం నాయకులు భి. శోభనాద్రి(ప్రెసిడెంట్‌) - రాజశేఖర్‌(సెక్రటరీ) - చందు(కరస్పాండెంట్‌)లు కోరడం జరిగింది.

ఈమద్య ‘ఎన్టీఆర్‌’ చిత్రంలో రానా కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తున్న కారణంగా ఏపీలో తెలుగు దేశంకు వెంకీ మరియు రానాలు మద్దతు తెలుపుతున్నారు అంటూ ప్రచారం జరుగుతుందని, అందుకే అభిమాన సంఘం నాయకులు ఇలా అభిమానులకు బహిరంగ లేఖ రాయడం జరిగిందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

Tags:    

Similar News