సెన్సార్ బోర్డును గిచ్చుతున్న దేవరకొండ

Update: 2018-09-29 08:30 GMT
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఏ విషయంపై అయినా స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. అలాగే అతను దేన్నయినా ప్రచార అస్త్రంగా మార్చేయగలడు. ‘గీత గోవిందం’ కోసం తాను పాడిన పాట మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తే.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని ఈ చిత్ర ఆడియో వేడుకలో ప్రదర్శించి కామెడీ పండించిన ఘనుడు విజయ్. తన గత సినిమా ‘అర్జున్ రెడ్డి’ విడుదలకు ముందు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పోస్టర్ల గురించి గొడవ చేస్తే.. ‘చిల్ తాతా’ అని కామెంట్ చేయడం ద్వారా సంచలనం సృష్టించాడతను. ఆ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్లో సెన్సార్ బోర్డు మీద అతను చేసిన వ్యాఖ్యలు.. ఈ సినిమాలోని బూతుల్ని మ్యూట్ చేయడంపై స్పందించిన తీరు వివాదాస్పదమయ్యాయి. ఇవన్నీ పబ్లిసిటీకి ఉపయోగపడ్డాయి.

తాజాగా అతను సెన్సార్ బోర్డును మరోసారి కవ్వించే ప్రయత్నం చేశాడు. తన కొత్త సినిమా ‘నోటా’కు తమిళ సెన్సార్ బోర్డు ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ ఇవ్వడంపై అతను ఆశ్చర్యపోయాడు. తాను ‘ఎ’ సర్టిఫికెట్ రావాలని కోరుకున్నా అని.. కానీ అక్కడి సెన్సార్ బోర్డు మాత్రం ‘యు’ చేతిలో పెట్టిందని.. మరి తన ప్రియమైన తెలుగు సెన్సార్ బోర్డు ఏం సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలని అతను ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. ‘నా ప్రియమైన తెలుగు సెన్సార్ బోర్డు’ అనడం ద్వారా ‘అర్జున్ రెడ్డి’ అనుభవాన్ని గుర్తు చేసి వాళ్లను రెచ్చగొట్టడమే. మరి ఈ వ్యాఖ్యల్ని ఇక్కడి సెన్సార్ బోర్డు ఎలా తీసుకుంటుందో.. ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇస్తుందో చూడాలి. ఈ చిత్ర ట్రైలర్లో ముద్దు సీన్ చూసి.. విజయ్ వాడిన బూతు పదం విని దీనికి కచ్చితంగా ‘ఎ’ సర్టిఫికెటే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తమిళ సెన్సార్ బోర్డు ‘యు’ ఇచ్చి షాకిచ్చింది. ఈ విషయమై దర్శకుడు ఆనంద్ శంకర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.
 
Tags:    

Similar News