నోటాలో ఇంకా ఇంకా కావాలంటున్నారు!

Update: 2018-09-09 07:58 GMT
మూడేళ్ళలో మూడు వరుస బ్లాక్ బస్టర్ల తో విజయ్ దేవరకొండ రేంజ్ ఊహలకతీతంగా పెరిగిపోయింది. ఈ స్థాయి ఎవరూ ఊహించింది కూడా కాదు. ఆ మాటకొస్తే గీత గోవిందం ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంత అనుభవం ఉన్న అల్లు అరవింద్ సైతం సరిగ్గా అంచనా వేయలేకపోయారు. యూత్ లో విజయ్ క్రేజ్ ఎంతగా పెరిగిపోయిందో ఈ ఉదాహరణను బట్టే చెప్పొచ్చు. వంద కోట్ల గ్రాస్ యాభై కోట్ల షేర్ ఇప్పటికీ కొందరు సీనియర్ హీరోలకు డ్రీం టాస్క్ గానే ఉంది. పరిశ్రమకు వచ్చి పదేళ్లయినా అది అందుకోలేక ప్రయత్నిస్తున్న హీరోలకు కొదవ లేదు. కానీ విజయ్ దేవరకొండ అనూహ్యంగా తన ఐదో సినిమాకే రీచ్ కావడం ఇప్పటికీ పజిల్ లాగే ఉంది. ఇక ఎక్కువ గ్యాప్ లేకుండా విజయ్ దేవరకొండ కొత్త సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. అందులో మొదటిది నోటా. ఇప్పటికే ట్రైలర్ కూడా విడుదలైపోయింది. కానీ ఆశించిన స్థాయిలో లేదనే పెదవి విరుపులు కొందరు అభిమానుల నుంచి వస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు.

విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ తో సహా ప్రేక్షకులు సైతం ఒక ప్రత్యేకమైన అంచనాలతో చూస్తున్నారు. ముఖ్యంగా యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో ఇప్పటి దాకా సక్సెస్ కొట్టిన విజయ్ ఇంత తక్కువ టైంలో సీనియర్ హీరోలు చేయాల్సిన పొలిటికల్ థ్రిల్లర్ వైపు టర్న్ తీసుకోవడం కొంత ప్రభావం చూపిస్తోంది. పైగా హీరోయిన్ మెహ్రీన్ ట్రైలర్ లో జస్ట్ ఒక్క సీన్ లో మాత్రమే కనిపించింది. కానీ విజయ్ దేవరకొండ చేసిన సినిమాల్లో ఇప్పటిదాకా కథానాయిక ఎందులోనూ వీక్ గా లేదు. రీతూ వర్మ-షాలిని పాండే-రష్మిక మందన్న ఎవరికి వారు చాలా స్పాన్ ఉన్న పాత్రలు దక్కించుకున్నారు. కానీ ఇందులో మెహ్రీన్ కు అంత సీన్ ఇచ్చినట్టు కనిపించడం లేదు. పైగా లీడర్ ఒకే ఒక్కడు ఛాయల్లో ట్రైలర్ కనిపించడం నాజర్ సత్యరాజ్ లాంటి తెలిసిన ఆర్టిస్టులు ఉన్నా తమిళ వాసన వేయటం ఇవన్నీ అభిమానుల పెదవి విరుపుకు కారణం అయ్యాయి. మరి ఈ అసంతృతప్తి దాటుకుని హైప్ పెంచుకోవడం నోటాకు పెద్ద సవాలే.
Tags:    

Similar News