బాలీవుడ్ స్టార్ హీరోని మించి సేతుప‌తి పారితోషికం?

Update: 2021-02-03 12:30 GMT
స‌మ‌కాలీన స్టార్ల‌లో ది బెస్ట్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుని దూసుకుపోతున్నాడు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి. ఒక చిన్న న‌టుడిగా ప్రారంభ‌మై.. ఇంతింతై అన్న చందంగా అత‌డు ఎదిగిన తీరు అస‌మానం అనే చెప్పాలి. సౌత్ లోనే ప్ర‌యోగాత్మ‌క పాత్ర‌ల్లో విల‌క్ష‌ణ‌మైన క‌థాంశాల్లో న‌టిస్తున్న హీరోగానూ సేతుప‌తి పాపుల‌ర‌య్యారు.

ప్ర‌స్తుతం అత‌డి స్థాయి సౌతిండ‌స్ట్రీ స‌హా ఉత్త‌రాదినా హాట్ టాపిక్ గా మారింది. ఒక సాధార‌ణ న‌టుడి అసాధార‌ణ జ‌ర్నీగా సేతుప‌తిని ప‌రిశ్ర‌మ‌లు పొగిడేస్తున్నాయంటే అర్థం చేసుకోవాలి. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుస‌గా క్రేజీ చిత్రాల‌కు సంత‌కం చేసి భారీ పారితోషికాలు అందుకుంటూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. మ‌రోవైపు బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోని మించి పారితోషికం అందుకుంటూ అక్క‌డ డెబ్యూ ఇవ్వ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఫ్యామిలీమ్యాన్ క్రియేట‌ర్స్ రాజ్ అండ్ డికె రూపొందిస్తున్న‌ కొత్త‌ వెబ్ సిరీస్ లో న‌టిస్తున్న సేతుప‌తికి ఆ సిరీస్ లో న‌టిస్తున్న కోస్టార్ షాహిద్ కపూర్ కంటే ఎక్కువ పారితోషికం చెల్లించ‌డం హాట్ టాపిక్ గా మారింది. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ `సన్నీ` పేరుతో ఇది రూపొందుతోంది. స్టార్ హీరో షాహిద్ కూడా తన డిజిటల్ అరంగేట్రం చేయనున్నాడు. ఇక సేతుప‌తి పారితోషికం ఎంత‌? అంటే.. మొత్తం సీజన్ కు షాహిద్ రూ .40 కోట్లకు ఒప్పందం చేసుకోగా.. సేతుప‌తి సుమారు 55 కోట్లు డిమాండ్ చేశార‌ని తెలుస్తోంది. షాహిద్ తో పోలిస్తే చాలా పెద్ద మొత్తాన్ని ఆర్జించ‌డం సంచ‌ల‌న‌మే అవుతోంది.

ఇక పారితోషికం మాత్ర‌మే కాదు.. ఇటు సౌత్ లో అత‌డు అసాధార‌ణ గౌర‌వం అందుకోవ‌డంపైనా చ‌ర్చ సాగుతోంది. టాలీ‌వుడ్ కోలీవుడ్ లోనూ అత‌డి పెద్ద‌రికం హాట్ టాపిక్ గా మారింది. వ‌రుస‌గా ప‌లువురు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సేతుప‌తితో ట్రైల‌ర్ లాంచ్ లు.. ఈవెంట్ గెస్ట్ అంటూ సంప్ర‌దించ‌డం అత‌డి కీర్తిప్ర‌తిష్ఠ‌ల్ని మ‌రింత పెంచుతోంది. తాజాగా వైర‌స్ నేప‌థ్యంలోని ప్ర‌యోగాత్మ‌క థ్రిల్ల‌ర్ మూవీ `A` (ఫిబ్రవరి 26 రిలీజ్‌) ట్రైలర్ ని సేతుప‌తి లాంచ్ చేయ‌డంపై చిత్ర‌బృందం ఆనందం వ్య‌క్తం చేసింది. నితిన్ ప్రసన్న .. అవంతిక ప్రొడక్షన్స్ అధినేత‌ గీతా మిన్సాల ద‌ర్శ‌కుడు యుగంధర్ ముని.. సేతుప‌తికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇక వైష్ణ‌వ్ తేజ్ న‌టిస్తున్న `ఉప్పెన` ప్ర‌మోష‌న్స్ లోనూ సేతుప‌తికి అధిక ప్రాధాన్య‌త‌నిస్తుండ‌డం విశేషం.
Tags:    

Similar News