బుల్లి మ‌గ‌ధీరని తీశాడా?!

Update: 2015-12-19 17:30 GMT
తెలుగులో నేటి జ‌న‌రేష‌న్‌ కి పున‌ర్జ‌న్మ‌ల క‌థ ప‌రిచ‌య‌మైంది... `మ‌గ‌ధీర‌`తోనే.  గ‌త జ‌న్మ‌లో ప్రేమికులైన ఓ జంట మ‌ళ్లీ ఈ జ‌న్మ‌లో ఎలా క‌లుసుకుంద‌నే అంశంతో `మ‌గ‌ధీర‌` తెర‌కెక్కింది. మంచి  ఫిక్ష‌న్ 34క‌థ‌కి విజువ‌ల్ ఎఫెక్ట్స్‌ ని జోడించి  తీయ‌డంతో `మ‌గ‌ధీర‌` సంచ‌ల‌నాల్ని సృష్టించింది. తొలిసారి తెలుగు ఇండ‌స్ట్రీకి వంద‌కోట్ల వ‌సూళ్ల రుచిని చూపించింది. అప్ప‌ట్నుంచి చాలామంది పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో క‌థ‌ల్ని రాసుకొన్నారు. అయితే మ‌గ‌ధీర స్థాయిలో ఆక‌ట్టుకున్న‌వి మాత్రం లేవు.

`మ‌గ‌ధీర` క‌థ‌ని సృష్టించిన విజ‌యేంద్ర‌ప్ర‌సాదే మ‌రోసారి పున‌ర్జ‌న్మ‌ల క‌థ‌ని రాశాడు. రాయ‌డమే కాదు.. వ‌ల్లీ పేరుతో సొంతంగానే తెర‌కెక్కించాడు. చిన్న బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ వంద‌కి తొంభై శాతం మ‌గ‌ధీర‌ని  పోలి వుంది. వెయ్యేళ్ల త‌ర్వాత మ‌రో జన్మ ఎత్తిన ఇద్ద‌రు ప్రేమికులు ఎలా క‌లుసుకున్నార‌న్న‌దే వ‌ల్లి క‌థ‌. అయితే ఈసారి సైన్స్‌ ని కూడా జోడించాడ‌ట‌. మ‌గ‌ధీర ఫాంట‌సీ క‌థైతే ఇది సైన్స్ ఫిక్ష‌న్ అన్న‌మాట‌. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వ‌ల్లి క‌థ గురించి తెలుసుకుని విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ బుల్లి మ‌గ‌ధీర‌ని తెర‌కెక్కించాడ‌ని మాట్లాడుకుంటున్నారు.

నిజానికి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌ కి దర్శ‌కుడిగా విజ‌యాలుండుంటే ఇది కూడా మగ‌ధీర స్టైల్‌ లో భారీస్థాయిలో తెర‌కెక్కాల్సిన సినిమా అట‌. కానీ విజయేంద్ర‌ప్ర‌సాద్ ర‌చ‌యితగా సూప‌ర్ స‌క్సెస్ అయ్యాడు కానీ... ద‌ర్శ‌కుడిగా మాత్రం అంత‌గా రాణించ‌లేక‌పోయాడు. అందుకే చిన్న బ‌డ్జెట్‌ తో కొత్త‌వాళ్ల‌తో ఈ సినిమా తీశాడు. మ‌రి పున‌ర్జ‌న్మ‌ల క‌థ చిన్న సినిమాగా వ‌ర్క‌వుట్ అవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News