విజ‌యేంద్రుడి ఖాతాలో మ‌రో ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్టు

Update: 2016-09-22 03:30 GMT
రెండు ద‌శాబ్దాల‌కు పైగా ర‌చ‌యిత‌గా కొన‌సాగుతున్నారు విజ‌యేంద్ర ప్ర‌సాద్. 90ల్లోనే ఆయ‌న ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ఇచ్చారు. ఆ త‌ర్వాత కొడుకు రాజ‌మౌళి కాంబినేష‌న్లో మ‌రిన్ని బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టారు.. కానీ ఆయ‌న పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది మాత్రం గ‌త ఏడాదే. వారం వ్య‌వ‌ధిలో బాహుబ‌లి.. భ‌జ‌రంగి భాయిజాన్ లాంటి మెగా సినిమాలు అందించారాయ‌న‌.

దీంతో ఆయ‌న క‌థ‌ల కోసం విప‌రీత‌మైన డిమాండ్ ఏర్ప‌డింది. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి త‌న కొడుకు నిఖిల్ ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డానికి విజ‌యేంద్ర ప్ర‌సాద్ స‌హ‌కార‌మే తీసుకున్నారు. బాలీవుడ్లోనూ రెండు ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టులకు ఆయ‌న ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తున్నారు. తాజాగా తమిళంలో ఓ పెద్ద సినిమాకు క‌థ‌.. స్క్రీన్ ప్లే అందించే బాధ్య‌త‌ను నెత్తికెత్తుకున్నారు విజ‌యేంద్ర ప్ర‌సాద్.

త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ త‌ర్వాతి సినిమాకు విజ‌యేంద్ర ప్ర‌సాదే స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌కుడు.‘రాజా రాణి’ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన అట్లీ.. ఆ త‌ర్వాత విజ‌య్ హీరోగా ‘తెరి’ తీశాడు. ఆ సినిమా త‌మిళంలో సూపర్ హిట్ట‌వ‌డంతో అత‌డితో మ‌రో సినిమా చేయ‌డానికి విజ‌య్ ఓకే చెప్పాడు. ఐతే ఈ చిత్రానికి క‌థ కోసం విజ‌యేంద్ర‌ను ఆశ్ర‌యించాడు అట్లీ. ప్ర‌స్తుతం ఆయ‌న ఆ పనిలోనే బిజీగా ఉన్నారు.
Tags:    

Similar News