పెళ్లాం కోసం రెస్టారెంట్‌ మొత్తం బుక్‌ చేశాడు

Update: 2019-05-01 09:05 GMT
పెళ్లాం అంటే ప్రేమ ఉండొచ్చు కానీ పిచ్చి ప్రేమ ఉండకూడదు. డబ్బుంది కదా అని పెళ్లాంపై ఎక్కువ ప్రేమ చూపిస్తే.. ఆ తర్వాత అసలుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. అయినా కుర్రాడు కదా ఈ విషయం అప్పుడే మనోడికి తెలియదులే. ఇంతకూ మనోడు అంటే ఎవరో తెలుసుగా.. విరాట్‌ కోహ్లి. విరాట్‌ కు అతని భార్య అనుష్క శర్మ అంటే చాలా ఇష్టం. ఆమెని తన అదృష్ట దేవతగా ఫీలవుతుంటాడు. గుడి కట్టలేదు కానీ గుండెల్లో పెట్టుకుని మరి పూజిస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా తనతో కూడా అనుష్కని తీసుకెళ్తుంటాడు.

మే 1న అనుష్క పుట్టినరోజు. ఆమె పుట్టినరోజు నాడు ఏదైనా స్పెషల్‌ గా చేయాలి అనుకున్నాడు విరాట్‌. చేతినిండా డబ్బులున్నాయి - గీక్కోడానికి కార్డులున్నాయి. ఇంకేముంది అనుష్కకు సర్‌ ప్రైజ్‌ ఇచ్చేందుకు బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌ మొత్తం బుక్‌ చేశాడు. ఆ రెస్టారెంట్‌ ని అనుష్కకు ఇష్టమైన కలర్స్‌ - ఫ్లవర్స్‌ తో అందంగా డెకరేట్‌ చేయించాడు. అనుష్కని ఈ రెస్టారెంట్‌ కు తీసుకువచ్చి విలువైన బహుమతులతో.. ఆమె జీవితంలో మర్చిపోలేని రోజుగా మార్చాలని ప్లాన్‌ చేశాడు విరాట్‌. ప్లాన్నింగ్‌ బాగానే ఉంది. కానీ  భార్యపై ప్రేమ కోసం ఇన్ని డబ్బులు తగలెయ్యాలా అని నెటిజన్లు విరాట్‌ పై విరుచుకు పడుతున్నారు.

పెళ్లాంపై ప్రేమ  ఉండొచ్చు కానీ ఆ ప్రేమ కోసం విరాట్‌ కోహ్లి డబ్బుల్ని వృథా చేస్తున్నాడనే కామెంట్స్‌ ని ఇప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవే డబ్బులు ఏవైనా అనాథ ఆశ్రమానికి ఇస్తే.. ఒక క్రికెట్‌ కెప్టెన్‌గా ఇంకా ఎంతో హుందాగా ఉండేదని నెటిజన్లు విరాట్‌ కు చురకలు అంటిస్తున్నారు. కానీ విరాట్‌ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. విమర్శలు వస్తున్నప్పుడు తాను ఇంకా గట్టిగా ఉంటానంటూ కలరింగిస్తూ.. అనుష్క కు ఏం రింగ్ కొనాలా అని బెంగళూరులో తిరుగుతున్నాడు.   
Tags:    

Similar News