మూసిన థియేటర్లు ఈ సినిమాతో తెరుచుకుంటాయ్: విష్వక్ సేన్

Update: 2021-08-12 03:30 GMT
'పాగల్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి హైదరాబాదులో జరిగింది. ఈ వేదికపై విష్వక్ సేన్ కంటే ముందుగా దిల్ రాజు మాట్లాడుతూ. " ఈ ఫంక్షన్ కి చాలామంది యంగ్ హీరోలు వచ్చాయి. ఇక్కడి ఫ్రెండ్లీ వాతావరణం నాకు నచ్చింది. ఇకపై మీరంతా ఒకరి సినిమా ఫంక్షన్స్ కి ఒకరు వెళుతూనే ఉండాలి. 'పాగల్' సినిమా గురించి విష్వక్ నాకు తరచూ కాల్ చేసేవాడు .. 'సార్ మన సినిమా థియేటర్లలోనే కదా?' అని అడిగేవాడు. ఇపుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదేమోనని నేను అనేవాడిని.

కొన్ని రోజుల క్రితం నాకు కాల్ చేసి థియేటర్లకు జనం బాగానే వస్తున్నారు .. మన సినిమాను ఈ 14వ తేదీన రిలీజ్ చేద్దామని అడిగాడు. ఇంత తక్కువ సమయంలో అది ఎలా సాధ్యం? అని అన్నాను నేను. అవన్నీ నేను చూసుకుంటానని చెప్పి, ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు. నాలుగు రోజుల్లోనే చకచకా పనులు పూర్తి చేసేసి .. ప్రమోషన్లు మొదలెట్టేసి ఈ సినిమాను ఇంతవరకూ తీసుకువచ్చాడు. అతని అంకితభావాన్ని చూసి ఒక నిర్మాతగా నేను ఇంప్రెస్ అయ్యాను. ఆయన ఎనర్జీ నాకు నచ్చింది. ఆయన కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

ఇక దర్శకుడు నరేశ్ కుప్పిలి కథ చెబుతున్నప్పుడే, ఆయన కొత్తగా ఏదో చెప్పాలనుకుంటున్నాడనే విషయం నాకు అర్థమైంది. ఇది కేవలం ఒక లవ్ స్టోరీ మాత్రమే కాదు .. ఇందులో చాలా యాంగిల్స్ ఉన్నాయి. నరేశ్ ఈ సినిమాలో నవ్విస్తాడు .. అక్కడక్కడా కన్నీళ్లు పెట్టిస్తాడు. ఆయనకి మంచి భవిష్యత్తు ఉంది .. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది" అని అన్నారు. ఇక ఆ తరువాత విష్వక్ సేన్ మాట్లాడాడు. "దిల్ రాజు గారి వల్లనే ఈ సినిమా మరో స్థాయికి వెళ్లింది. రెండు నెలల్లో చనిపోయే ఒక తల్లి తన కొడుకుతో "అందరినీ ప్రేమిస్తూ వెళ్లు .. ఎక్కడో ఒక చోట నా లాంటి ప్రేమ నీకు దొరుకుతుంది" అంటుంది. అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది.

నరేశ్ కుప్పిలి నాకు కథ చెప్పగానే .. ఇంతమంచి కథను వదులుకోకూడదనే ఉద్దేశంతో వెంటనే ఒప్పేసుకున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మళ్లీ నాతో సినిమా చేయమంటే చేస్తాడో లేదో. కచ్చితంగా అంత పెద్ద డైరెక్టర్ అవుతాడు. ఇంతకుముందు నేను ఇలియానా ఫేవరేట్ ను .. కానీ ఈ సినిమా నుంచి నేను నివేదా పేతురాజ్ అభిమానిని అయ్యాను. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత మీరు కూడా ఆమె ఫ్యాన్స్ కావడం ఖాయం. రధన్ సంగీతం .. విజయ్ బెన్ని కొరియోగ్రఫీ .. లియోన్ రీ రికార్డింగ్ అదుర్స్ అనిపిస్తాయి.

కొంతమంది అడిగారు .. ఈ పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తున్నావ్ .. ఇది రైటా అని అడిగారు. అలాంటివాళ్లకి నేను ఒకటే చెప్పాను. సర్కస్ లో సింహంతో ఎవడైనా ఆడుకుంటాడు. నేను అడవిలోని సింహంతో ఆడుకునే టైపు. ఈ సినిమా మామూలుగా ఉండదు .. మూసుకున్న థియేటర్లను కూడా ఈ సినిమాతో ఓపెన్ చేయిస్తా .. అమ్మతోడు. గుర్తుపెట్టుకోండి పేరు విష్వక్ సేన్ .. తప్పయితే మార్చుకుంటా" అంటూ చెప్పుకొచ్చాడు.





Tags:    

Similar News