ఈ నగరానికి ఏమైంది.. టికెట్లు దొరకట్లేదా?

Update: 2018-07-03 17:30 GMT
గత శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ఈ నగరానికి ఏమైంది’. ‘పెళ్ళిచూపులు’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ రూపొందించిన సినిమా కావడం.. పైగా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి పెద్ద బేనర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం.. ప్రోమోలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో దీనికి మంచి హైపే వచ్చింది. కానీ ఆ అంచనాల్ని ఈ సినిమా అందుకోలేకపోయింది. ‘పెళ్ళిచూపులు’తో పోలిస్తే ఇందులో చాలా లోపాలు కనిపించాయి. బలహీన కథాకథనాలపై ఒకింత నిరాశ వ్యక్తం చేశారు ప్రేక్షకులు. అలాగని సినిమా తీసిపడేసేలా ఏమీ లేదు. ఇందులోని ఎంటర్టైన్మెంట్ యూత్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. సినిమా ఓ మోస్తరుగా ఆడుతోంది. కానీ ఈ చిత్ర హీరో మాత్రం సినిమా కలెక్షన్ల గురించి మరీ అతిగా చెప్పేశాడు.

‘ఈ నగరానికి ఏమైంది’ థ్యాంక్స్ మీట్లో మాట్లాడుతూ సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతోందని.. టికెట్లు దొరికే పరిస్థితి లేదని అన్నాడు. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో తనకు విపరీతంగా మెసేజ్ లు వస్తున్నాయని.. అందులో సినిమా చూసిన వాళ్లకంటే చూడకుండా మెసేజ్ చేస్తున్న వాళ్లే ఎక్కువ మంది ఉంటున్నారని.. వాళ్లందరికీ టికెట్లు దొరకట్లేదంటున్నారని.. ఇలా అందరికీ టికెట్లు దొరికి సినిమా చూడాలంటే ఇంకో రెండు మూడు వారాలైనా పడుతుందని చెప్పాడు విశ్వక్సేన్. కానీ వీకెండ్లోనే ఈ చిత్రానికి అన్ని చోట్లా హౌస్ ఫుల్స్ పడలేదు. ఏవో కొన్ని స్క్రీన్లు మినహాయిస్తే అన్ని చోట్లా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ తర్వాత బుకింగ్స్ చూస్తే థియేటర్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మరి వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. టికెట్లు దొరికే పరిస్థితి లేదని చెప్పుకుంటే అతిగా అనిపించదూ!
Tags:    

Similar News