సమంతకి వచ్చిన వ్యాధి ఏంటి? 'మైయోసిటిస్' అంటే ఏంటి?

Update: 2022-10-29 14:28 GMT
దక్షిణాది అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు గత కొంతకాలంగా మైయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని అనుకున్నానని.. కానీ నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉందని పేర్కొంది. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వసిస్తున్నారని సామ్ తెలిపింది.

సమంత ఇప్పుడు మైయోసిటిస్ ఆటో ఇమ్యునో డిజార్డర్ తో బాధ పడుతున్నట్లుగా ప్రకటించడంతో అభిమానులు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా స్ట్రాంగ్ గా తిరిగి రావాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అలానే మైయోసిటిస్ అంటే ఏంటి? ఆ వ్యాధి లక్షణాలు ఏంటి? దీనికి చికిత్స ఎలా ఉంటుంది? వంటి విషయాల గురించి తెలుసుకోడానికి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు.

గూగుల్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మైయోసిటిస్ అనేది ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి అని తెలుస్తోంది. కండరాల్లో వాపు రావడం.. బలహీనంగా మారడం..  విపరీతమైన నొప్పి వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలుగా తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడేవారు ఎక్కువ సేపు నడవలేరు.. అలానే నిల్చోలేరు. కండరాలు బలహీనంగా మారడంతో త్వరగా అలసిపోతుంటారు. ఈ వ్యాధి సోకిన వారు కూర్చున్న స్థానం నుండి లేచి నిలబడటం కూడా కష్టంగా ఉంటుంది.

మెట్లు ఎక్కడం - చేతులు ఎత్తడం కష్టంగా మారుతుంది. మింగడం లేదా శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తాయి. గాయాలైనా ఇన్ఫెక్షన్లు వచ్చినా, రోగ నిరోధక శక్తి క్షీణించినా ఈ వ్యాధి వస్తుంది. ఇది ముందు సాధారణ నుంచి కాలక్రమేణా నెమ్మదిగా అధ్వాన్నంగా మారుతుందని తెలుస్తోంది. దీనిలో పాలీమయోసిటిస్ మరియు డెర్మాటోమయోసిటిస్ అనే రెండు నిర్దిష్ట రకాలు ఉంటాయి.

ప్రస్తుతానికి మైయోసిటిస్ కు చికిత్స లేదని తెలుస్తోంది. ఈ చికిత్సలో అతిపెద్ద సమస్య ఏంటంటే.. దీనికి ఖచ్చితమైన రోగ నిర్ధారణను పొందలేము. అయినప్పటికీ దీని వల్ల కలిగే నొప్పిని తగ్గించడానికి.. కండరాలను మరింత బలహీనంగా మారడాన్ని నిరోధించడానికి చికిత్స ఉంది. మైయోసిటిస్‌ తో బాధపడుతున్న వ్యక్తులు తక్కువ మోతాదులో స్టెరాయిడ్ మరియు ఇమ్యునోసప్రెసివ్ థెరపీ కలయికతో పాటు వ్యాయామంతో ప్రతిస్పందిస్తారు.

95 శాతం కంటే ఎక్కువ మంది డయాగ్నసిస్ చేసిన తర్వాత 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉన్నారని తెలుస్తోంది. ఈ వ్యాధి బారిన పడినవారిలో చాలా మంది తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి తీవ్రమైన అనారోగ్యాన్ని అనుభవిస్తారు. మరికొందరు సంవత్సరాల తరబడి ఈ లక్షణాలతో పోరాడుతున్నారు. మైయోసిటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నవారు కూడా ఉన్నారు. దీనికి కొన్ని నెలల సమయం పడుతుంది. ఎందుకంటే శరీరంలో కండరాలు గట్టి పడటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. అయితే తీవ్రమైన లక్షణాలతో ఉన్న వ్యక్తులు మాత్రం కోలుకోలేరని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

'యశోద' టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో అందరికీ కృతజ్ఞతలు చెబుతూ.. తనకున్న వ్యాధి గురించి తెలియజేసింది సమంత. ''జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి 'మయోసైటిస్' (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్ తో బాధపడుతున్నా. ఉపశమనం పొందిన తర్వాత నేను దీన్ని అందరికీ షేర్ చేయాలని ఆశించాను. కానీ నేను ఆశించిన దానికంటే కొంచెం ఎక్కువ సమయం పడుతోంది''

"అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్నా సందర్భాలున్నాయి. ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్ యూ" అని సమంత తన ట్వీట్ లో పేర్కొంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News