బాక్సాఫీస్ వార్ లో గెలిచేది ఎవ‌రు?

Update: 2022-03-07 14:30 GMT
పాన్ ఇండియా సినిమాల‌తో టాలీవుడ్ భార‌తీయ సినీరంగంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. 'బాహుబ‌లి' నుంచి మొద‌లైన ఈ పరంప‌ర ఇప్ప‌డు ప‌తాక స్థాయికి చేరుకుంది. ఈ మార్చి నెల‌లో ఇండియ‌న్ సినిమా అబ్బుర‌ప‌రుస్తూ రెండు పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేయ‌బోతున్నాయి. ప్ర‌భాస్ న‌టించిన 'రాధేశ్యామ్‌' ఈ నెల 11న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. రిలీజ్ కు మ‌రో నాలుగు రోజులే వుండ‌టంతో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి మొద‌లైంది.

ఈ మూవీ రిలీజ్ కి రెండు వారాల అనంత‌రం జ‌క్క‌న్న రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ ఆర్ ఆర్‌' మార్చి 25న విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ హంగామా ఓవ‌ర్సీస్‌లో మొద‌లైంది. ప్రీమియ‌ర్ షోకి సంబందించిన టికెట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడు పోవ‌డ‌మే కాకుండా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఏకండా ఫ్లోరిడాలోని ఓ థియేట‌ర్ కు సంబంధించిన ఈవినింగ్ షోని ఫుల్ గా బుక్ చేసుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  

రెండు వారాల వ్య‌వ‌ధిలో పోటీప‌డుతున్న రాధేశ్యామ్‌, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల‌పై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల‌పై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. బాక్సాఫీస్ వ‌ద్ద రెండు వారాల వ్య‌వ‌ధిలో పోటీప‌డుతున్న ఈ రెండు చిత్రాల్లో గెలిచేది ఎవ‌రు? .. బాక్సాఫీస్ వ‌ద్ద విజేత‌ల నిలిచేది ఎవ‌రున్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. రాధేశ్యామ్,  ఆర్ ఆర్ ఆర్ రెండు విభిన్న‌మైన క‌థ‌ల‌తో భిన్న‌మైన జోన‌ర్‌ల‌లో రూపొందాయి. ఈ విష‌యంలో వీటి మ‌ధ్య పోటీ లేదు. అయితే ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన స్టార్ కాస్టింగ్, డైరెక్ట‌ర్స్ యాంగిల్ లో చూస్తే మాత్రం 'ఆర్ ఆర్ ఆర్‌' దే పై చేయిగా క‌నిపిస్తోంది.

'రాధేశ్యామ్‌' కు సేల‌బుల్ పాయింట్ ప్ర‌భాస్ మాత్ర‌మే. ఆర్ ఆర్ ఆర్ విష‌యం అలా కాదు. అక్క‌డ ముగ్గురు ప్ర‌ధాన పాత్రలు పోషించ‌బోతున్నారు.. రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, రాజ‌మౌళి.. 'రాధేశ్యామ్‌' రొమాంటిక్ ఫిక్ష‌న‌ల్ పిరియాడిక్ డ్రామా. 'ఆర్ ఆర్ ఆర్‌' కూడా ఫిక్ష‌న‌ల్ డ్రామానే అయినా అది తెలిసిన ఇద్ద‌రు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీంల‌కు చెందిన క‌థ కావ‌డం ఈ మూవీకి ప్ర‌ధాన ఎస్సెట్ గా నిల‌వ‌బోతుండ‌గా, 'బాహుబ‌లి' కార‌ణంగా ఏర్ప‌డిన రాజ‌మౌళి క్రేజ్ మ‌రో ఎస్సెట్ గా మారి ఉత్త‌రాదిలో 'ఆర్ ఆర్ ఆర్‌' కు ప్ర‌ధాన బ‌లంగా నిల‌వ‌బోతోంది.

అంతే కాకుండా ఇప్పుడు దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు, ఫ్యాన్స్ మాస్ ఎలిమెంట్ప్ వున్న చిత్రాల‌నే ఇష్ట‌ప‌డుతున్నారు. ఆ విష‌యంలో ముందు వ‌రుస‌లో వుంది 'ఆర్ ఆర్ ఆర్‌'. ట్రైల‌ర్ లో రోమాంచిత ఘ‌ట్టాల‌ని రివీల్ చేయ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి 'ఆర్ ఆర్ ఆర్‌' పైనే వుంది. 'రాధేశ్యామ్‌' ప‌రిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. ఇదొక రొమాంటిక్ పిరియాడిక్ ఫిల్మ్ . ఏదో ఒక అంశం మెస్మ‌రైజ్ చేస్తే త‌ప్ప హ్యూజ్ రెస్పాన్స్ ని రాబ‌ట్ట‌గ‌ల‌దు. అయితే ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ప్ర‌భాస్ కు 'బాహుబ‌లి'తో దేశ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

 అదే 'సాహో'కు బాగా క‌లిసొచ్చింది. ఇదే మ్యాజిక్ 'రాధేశ్యామ్' విష‌యంలోనూ రిపీట్ కావ‌డం గ్యారెంటీ అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఈ రేసులో ఆర్ ఆర్ ఆర్‌' తో జ‌క్క‌న్న పై చేయి సాధిస్తారా? లేక 'రాధేశ్యామ్‌'తో ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో నిలుస్తారా? అన్న‌ది తెలియాలంటే ఈ నెలాఖ‌రు వ‌రకు వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News