'నోటా' విడుద‌ల ఆపాలని కాంగ్రెస్ డిమాండ్!

Update: 2018-10-02 15:01 GMT
వ‌రుస‌ హిట్ ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌....తాజాగా `నోటా`తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ లో భాగంగా విజ‌య్ షాకింగ్ కామెంట్స్ చేసిన విష‌యం విదిత‌మే. `నోటా` విడుద‌ల‌ను ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని అన్నాడు. ఈ సినిమా చూసిన వారంతా `నోటా` నొక్కేస్తారని కొంత‌మంది భ‌య‌ప‌డుతున్నార‌ని, తెలంగాణలో ఓ పార్టీకి అనుకూలంగా ఈ సినిమా ఉంటుందని కొంత‌మంది అనుకుంటున్నార‌ని చెప్పాడు. అవ‌న్నీ అవాస్త‌వాల‌ని - రాజ‌కీయాల‌లో యువ‌త ఏ విధంగా మార్పు తీసుకురావ‌చ్చ‌నే అంశం త‌మ సినిమాలో చూపించామ‌ని అన్నాడు. విజ‌య్ ఇంత క్లారిటీ ఇచ్చిన‌ప్ప‌టికీ `నోటా`విడుద‌ల‌ను అడ్డ‌కునేందుకు కాంగ్రెస్ నేత‌లు య‌త్నిస్తున్నారు.

నోటా సినిమా నిలిపివేయాలని  కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి - టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్‌ చేశారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోతోన్న ముంద‌స్తు ఎన్నికలను `నోటా` సినిమా ప్రభావితం చేసే అవకాశం ఉందని సుధాక‌ర్ రెడ్డి అన్నారు. ఈ సినిమా యువతపై ప్రభావం చూపుతుందని - యువ‌త నోటా ఆప్ష‌న్ ఎంచుకునేలా ఆ సినిమా ట్రైల‌ర్ ఉంద‌ని తాము భావిస్తున్నామన్నారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని - నోటా ప్రివ్యూను ఈసీ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, అన్ని విష‌యాలు ప‌రిశీలించిన మీద‌టే ఈ సినిమా సెన్సార్ చేశామ‌ని - స‌ర్టిఫికెట్ ఇచ్చామ‌ని సెన్సార్ బోర్డు క్లారిటీ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణ‌లోని కొన్ని రాజ‌కీయ పార్టీలు ఈ సినిమా విడుద‌ల‌ను రాజ‌కీయం చేస్తున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.


Tags:    

Similar News