షూటింగ్ కోసం ఓటుకు డుమ్మా కొట్టిన విశాల్!

Update: 2019-04-19 07:25 GMT
ఇండియాలో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండకపోవడానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి.  వాటిలో ఒకటి ఏంటంటే.. రాజకీయాల గురించి గంటల తరబడి మాట్లాడేవారు.. టీవీల్లో వచ్చే అన్నిరకాల చర్చలను తీరిగ్గా భరించేవారు.. రాజకీయాలు కుళ్ళిపోయాయని తిట్టిపోసేవారు ఓటు వేయకుండా దూరంగా ఉండడం.  వీరితో పాటుగా  ఓటు వేయాలని సాధారణ ఓటర్లను చైతన్యపరిచే సెలెబ్రిటిలు కూడా ఓటు వేయకుండా డుమ్మా కొట్టడం.  
 
నడిగర్ సింగం.. తమిళ నిర్మాతల కౌన్సిల్ లో కీలకమైన పదవులలో ఉన్న హీరో విశాల్ ఈమధ్య అందరినీ ఓటు వేయాలని కోరుతూ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు.  కొంత కాలం క్రితం జరిగిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలలో కూడా నామినేషన్ వేయడానికి ప్రయత్నించడం.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చానని చెప్పడంతో విశాల్ ఈసారి తప్పనిసరిగా ఓటు వేస్తాడని అనుకున్నారు. కానీ విశాల్ మాత్రం తమిళనాడు లో ఓటింగ్ జరిగిన రోజున అజర్ బైజాన్ లో తన కొత్త సినిమా షూటింగ్ బిజీగా ఉన్నాడట. అందుకే ఓటింగ్ కు డుమ్మా కొట్టాడు.

అందరినీ ఇలా ఓటు వేయమని చైతన్యపరిచి తనే స్వయంగా ఓటు వేయకపోవడం ఏంటో విశాల్ కే తెలియాలి.  దీనిపై నెటిజనులు విశాల్ కు గట్టిగానే చురకలు అంటిస్తున్నారు.  పక్కన ఉండే వాళ్ళకు చెప్పేందుకే నీతులు ఉన్నాయని.. తమ వరకూ వస్తే పాటించరని విమర్శిస్తున్నారు.  చిత్రమైన విషయం ఏంటంటే టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున కూడా సరిగ్గా లాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు.  ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా నాగార్జున ను ఓటు వేసే విషయంలో ప్రజలను చైతన్యపరచాలని కోరితే.. 'ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం ఉందని.. తప్పకుండా ఓటు వేస్తామని" తెలిపాడు. అయితే విదేశాలలో షూటింగ్ కారణంగా ఓటు వేయలేదు!
    

Tags:    

Similar News