బాలీవుడ్ స్టార్లకు సామాజిక బాధ్యత లేదా?

Update: 2020-03-31 08:31 GMT
ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు ముందుకు వచ్చి సామాజిక బాధ్యతగా తమవంతు సాయం అందిస్తారు. టాలీవుడ్ ప్రముఖులలో చాలామంది ఇలా ప్రతి సందర్భంలోనూ తమ మంచి మనసును చాటుకున్నారు. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలను అతలాకుతలం చేస్తోంది. ఎంతో మంది ఉపాధి లేక ఇబ్బందిపడుతున్నారు. అందులో సినీ రంగానికి చెందినవారు కూడాఉన్నారు.  దీంతో మన టాలీవుడ్ ప్రముఖులు చాలామంది ముందుకు వచ్చి భారీగా విరాళాలు ప్రకటించారు.  కరోనావైరస్ కారణంగా నష్టం జరిగిన వారికి బాసటగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే బాలీవుడ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం.. పెద్దగా స్పందించకపోవడం చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు సంధిస్తున్నారు. కోట్లకు కోట్లుసంపాదించే సెలబ్రిటీలు ఇలాంటి ఆపత్కాలంలో ముందుకు రాకపోవడం చాలామందిని షాక్ కు గురి చేస్తోంది.  అక్షయ్ కుమార్.. అనుష్కశర్మ..  కార్తీక్ ఆర్యన్.. రాజ్ కుమార్ రావ్.. నానా పటేకర్.. వరుణ్ ధావన్ ఇప్పటి వరకూ సాయం అందించారు. హృతిక్ రోషన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వర్కర్లకు N95 మాస్కులుఅందజేసినట్టు  ప్రకటించారు.  అయితే ఇంకా చాలామంది సెలబ్రిటీలు.. స్టార్లు హోమ్ ఐసోలేషన్ తో పాటు డొనేషన్ విషయంలో కూడా ఐసోలేషన్ పాటించడంపై విమర్శలు వస్తున్నాయి.

కొందరు నెటిజన్లు ఈ స్టార్లు ఇప్పటికైనా నిద్ర లేవాలని..  సాయం చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నారు. ఇలాంటి సామాజిక బాధ్యతలేని హీరోల సినిమాలను బాయ్ కాట్ చెయ్యాలని కూడా కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాదు సౌత్ లో మీడియా ఎంతో యాక్టివ్ గా ఉంటూ సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చేలా ఒత్తిడి తీసుకొస్తోందని..  ముంబై మీడియా మాత్రం ఈ విషయంలో నిద్రపోతోందని కూడా నెటిజన్లు విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
Tags:    

Similar News