సినీ ఇండస్ట్రీ డేంజర్ జోన్ లోకి వెళ్లే పరిస్థితి వస్తోందా..?

Update: 2022-05-12 06:06 GMT
కరోనా పాండమిక్ నేపథ్యంలో గత రెండేళ్లలో సినీ ఇండస్ట్రీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. థియేటర్స్ మూసేయడంతో వినోదం కోరుకునే ప్రేక్షకులకు ఓటీటీలు పరిచయమయ్యాయి. ఇప్పటివరకు బిగ్ స్క్రీన్ మీద సినిమాలు చూసి ఎంజాయ్ చేసే ఆడియన్స్.. ఓటీటీలలో స్మాల్ స్క్రీన్ పై సినిమాలు చూడటానికి అలవాటు పడిపోయారు.

అయితే ఇప్పుడు వైరస్ భయం పోయి చిత్ర పరిశ్రమ ఎప్పటిలాగే సాధారణ స్థితికి రావడానికి కృషి చేస్తోంది. ప్రేక్షకులకు అపరిమితమైన వినోదాన్ని అందించడానికి, వారం వారం సరికొత్త సినిమాలను విడుదల చేస్తున్నారు. కానీ ఒకప్పటిలాగా జనాలు సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడం లేదనే విషయం సినీ ఇండస్ట్రీని కలవరపెడుతోంది.

ఈ ఏడాదిలో తెలుగులో ఇప్పటి వరకు 35కి పైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో అర డజను చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలీవుడ్ సిచ్యుయేషన్ మరీ దారుణంగా ఉంది. స్టార్ హీరోలు చేసిన సినిమాలు మినిమమ్ ఓపెనింగ్స్ రాబట్టలేకపోతున్నాయి.

ఎంత మంచి సినిమా తీసినా.. జనాలు థియేటర్లకు వచ్చి చూడటానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. కాకపోతే RRR - కేజీయఫ్ 2 - పుష్ప వంటి మాస్ అండ్ యాక్షన్ జోనర్ సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు. దీనిని బట్టి ఒకప్పుడు రెగ్యులర్ గా సినిమాలకు వెళ్లే ఆడియన్స్ మనస్తత్వం పాండమిక్ తర్వాత పూర్తిగా మారిపోయిందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ సక్సెస్ మీట్ కి హాజరైన అగ్ర నిర్మాత అల్లు అరవింద్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ చాలా సమస్యల్లో ఉందని.. కోలుకొని మళ్ళీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని.. ఎప్పటిలాగే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడాలని ఆకాంక్షించారు.

''రెండేళ్ళలో ఇండస్ట్రీ చాలా మారింది. ప్రస్తుతం మన ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ లో ఉంది. ఎందుకంటే ప్రేక్షకులు ఒకప్పటిలా థియేటర్ కు వచ్చి సినిమాలు చూసే అలవాటు తప్పిపోయింది. ఇదివరకు శని ఆదివారాలు వస్తే తనను సినిమాకి తీసుకువెళ్ళమని భార్యలు తమ భర్తలను అడిగే అలవాటు ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూసే కాలం వచ్చేసింది'' అని అల్లు అరవింద్ అన్నారు.

'అశోకవనంలో అర్జున కల్యాణం' లాంటి సినిమాలు నాలుగొస్తే ఆ రోజులు తప్పకుండా తిరిగి వస్తాయని అల్లు అరవింద్ అభిప్రాయ పడ్డారు. అంతేకాక హిందీ సినీ పరిశ్రమ పరిస్థితి కూడా ఏమాత్రం బాలేదని.. స్టార్ హీరోలు చేసిన సినిమాలకు కూడా కనీస ఓపెనింగ్స్ ఉండటం లేదని అన్నారు.

''ఇప్పుడు నార్త్ లో ఎంత మంచి సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఉండటం లేదు. పెద్ద పెద్ద యాక్టర్స్ కు కూడా ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో అర్థం కావడం లేదు'' అని మెగా ప్రొడ్యూసర్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' విడుదల అవుతోంది. అది సూపర్ హిట్ అవ్వాలని.. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అల్లు అరవింద్ అన్నారు.

అల్లు అరవింద్ చెప్పిన దాంట్లో నిజం ఉందనేది అందరూ అంగీకరించే వాస్తవమే. కాకపోతే ఇప్పుడు సినీ అభిమానుల అభిరుచి చాలా మారిపోయింది. ఓటీటీలు విరివిగా కంటెంట్ అందిస్తుండంతో.. కొన్ని సెలెక్టివ్ సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్తున్నారు. అధిక టికెట్ రేట్లు ఉండటంతో.. ఎలాగూ మూడు నాలుగు వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే ధోరణిలో ఉంటున్నారు ప్రేక్షకులు.

ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా చూడటానికి ఫ్యామిలీతో కలిసి థియేటర్ కు వెళ్తే అయ్యే ఖర్చుతో.. రెండు మూడు ఓటీటీల ఏడాది సబ్ స్క్రిప్షన్ దొరుకుతుంది. అందుకే మెజారిటీ ఆడియన్స్ ఓటీటీలో ఇంట్లో కూర్చొని సినిమా చూడటానికే ఇష్టపడుతున్నారు. ఇది చిత్ర పరిశ్రమను కలవరపెట్టే అంశమే. ఇదిలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇండస్ట్రీ డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
Tags:    

Similar News