'ఇండియ‌న్ 2' ఇప్ప‌టికైనా ముందుకు సాగేనా?

Update: 2022-08-25 00:30 GMT
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హ‌స‌న్ న‌టించిన `ఇండియ‌న్‌` 1996లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న విష‌యం తెలిసందే. క‌మ‌ల్ - శంక‌ర్ ల తొలి కాంబినేష‌న్ లో రూపొందిన ఈ మూవీ త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో ఊహించ‌ని విధంగా రికార్డులు సృష్టించింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల విరామం త‌రువాత ఈ మూవీకి శంక‌ర్ `ఇండియ‌న్ 2` పేరుతో సీక్వెల్ చేస్తున్నారు. అదే సేనాపతి పాత్ర‌తో మ‌రో సారి మ్యాజిక్ చేయాల‌ని ప్లాన్ చేశాడు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేశారు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా సిద్ధార్ధ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ కీల‌క పాత్ర‌ల్లో షూటింగ్ ప్రారంభించారు. అయితే క‌మ‌ల్‌, కాజ‌ల్ ల‌పై కీల‌క ఘ‌ట్టాన్ని చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద వ‌శాత్తు క్రేన్ విరిగి ప‌డ‌టంతో యూనిట్ స‌భ్యులు న‌లుగురు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న కార‌ణంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ కి, ద‌ర్శ‌కుడు శంక‌ర్ కి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు త‌లెత్తాయి.

దీంతో ఈ మూవీ షూటింగ్ ని అర్థాంత‌రంగా ఆపేశారు. మ‌ధ్య‌లో శంక‌ర్ హీరో రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్ట్ ని ప్రారంభించ‌డంతో లైకా వ‌ర్గాలు శంక‌ర్ పై కోర్టుకు వెళ్లాయి. దీంతో వివాదం మ‌రింత‌గా ముదిరి సినిమా ఇక ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే అనే వార్త‌లు వినిపించాయి.

ఇదిలా వుంటే రీసెంట్ గా క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన  `విక్ర‌మ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో క‌మ‌ల్ చొర‌వ తీసుకుని `విక్ర‌మ్‌`ని చెన్నైలో డిస్ట్రిబ్యూట్ చేసిన రెడ్ జైంట్ పిక్చ‌ర్స్ అధినేత, యంగ్ హీరో ఉద‌య‌నిధి స్టాలిన్ ని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేయ‌డంతో ఈ మూవీ బుధ‌వారం అనూహ్యంగా ప‌ట్టాలెక్కింది.

బుధ‌వారం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిపి ఈ మూవీని తిరిగి ప్రారంభిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. బ‌హుషా ఇన్నేళ్ల సినీ చ‌రిత్ర‌లో ఇలా మ‌ళ్లీ మొద‌లైన సినిమా `ఇండియ‌న్ 2` ఒక్క‌టేనేమో. ఇదిలా వుంటే బుధ‌వారం పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని మాత్రం వ‌చ్చే నెల నుంచి ప్రారంభించ‌బోతున్నారు. హీ ఈజ్ బ్యాక్ అంటూ బుధ‌వారం చిత్ర బృందం కొత్త పోస్ట‌ర్ ని కూడా విడుద‌ల చేసింది.

అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల షూటింగ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఇప్ప‌టికైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్త‌వుతుందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌తీ ఒక్క‌రి మ‌దిని తొలుస్తున్న ప్ర‌శ్న‌. ఉద‌య‌నిధి స్టాలిన్ ఈ మూవీ నిర్మాణంలో లైకాతో క‌లిసి భాగం అయిన నేప‌థ్యంలో ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ మూవీని పూర్తి చేస్తార‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ పూర్తి చేసిన త‌రువాతే శంక‌ర్ .. రామ్ చ‌ర‌ణ్ సినిమా ని పూర్తి చేస్తాడ‌ట‌.
Tags:    

Similar News