ఏపీలో ఖిలాడీ ఆటలు సాగుతాయా..?

Update: 2022-02-07 10:30 GMT
మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ నటించిన లేటెస్ట్ మూవీ ''ఖిలాడి'' ఫిబ్రవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. దీనికి తగ్గట్టుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ ప్రతికూల పరిస్థితుల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సి వస్తోంది.

'క్రాక్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ.. అదే ఏడాది సమ్మర్ లో ''ఖిలాడీ'' చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే కరోనా మహమ్మారి ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది. షూటింగ్ కాస్త ఆలస్యం అవడంతో.. సరైన డేట్ కోసం వేచి చూసి వాలెంటైన్స్ వీక్ లో దించాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇప్పుడు పెద్ద సినిమాల విడుదలకు అనుకూల ప‌రిస్థితులేమీ లేవు.

తెలంగాణాలో కోవిడ్ ఆంక్షలు లేనప్పటికీ.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో నైట్ క‌ర్ఫ్యూ మరియు 50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఆక్యుపెన్సీ అనేది రవితేజ సినిమాకు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు. ఎందుకంటే 'క్రాక్' సినిమా యాభై శాతం సీటింగ్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కానీ రాత్రిపూట కర్ఫ్యూ అనేది కచ్చితంగా ఇబ్బందే.

నైట్ క‌ర్ఫ్యూ వల్ల మూడు షోలు ప్రదర్శించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సెకండ్ షోలు లేకపోతే వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది. ప్ర‌స్తుతానికి ఈ నెల 14 వ‌ర‌కు ఏపీలో నైట్ క‌ర్ఫ్యూ అమలులో ఉండ‌బోతోంది. ఆ త‌ర్వాత ప‌రిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ సానుకూల నిర్ణయం వచ్చినా.. 11వ తేదీన థియేటర్లలోకి వచ్చే 'ఖిలాడీ' మొదటి నాలుగు రోజుల వసూళ్లకు దెబ్బే.

ఒకవేళ షోల టైమింగ్స్ మార్చుకుంటే థియేటర్లలో నాలుగు షోలు వేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో పలు థియేటర్లలో నాలుగు షోలు వేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఏపీ రీజియన్ లో ఇంకా ఖిలాడీ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. మరి రోజుకు ఎన్ని ఆటలు ప్రదర్శిస్తారు? అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందేమో చూడాలి.

ఇకపోతే 'ఖిలాడీ' చిత్రాన్ని మరో వారం వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాలని రవితేజ మేకర్స్ కు సూచించారనే టాక్ ఉంది. అయితే ఫిబ్రవరి 25న అర డజను క్రేజీ సినిమాలు షెడ్యూల్ చేయబడి ఉన్నాయి. ఈ నెల 18న రిలీజ్ చేస్తే సినిమా ర‌న్ వారానికే పరిమితం అవుతుంది.. అదే 11న విడుదల చేస్తే రెండు వారాల పాటు సినిమా థియేటర్లలో ఉంటుందని మేకర్స్ ఆలోచించిస్తున్నారట.

అందులోనూ 'ఖిలాడీ' చిత్రాన్ని తెలుగుతోపాటుగా హిందీలోనూ రిలీజ్ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్ వారు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇచ్చారు. జయంతి లాల్ నిర్మించిన 'గంగూబాయి' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఫిబ్ర‌వ‌రి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఏపీలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రవితేజ చిత్రాన్ని ముందుగా ప్రకటించిన తేదీకే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.

తక్కువ టికెట్ ధరలు ఉన్నా కంటెంట్ బాగుంటే వసూళ్లు వస్తాయని 'బంగార్రాజు' సినిమా ప్రూవ్ చేసింది. ఇప్పుడు టైమింగ్స్ అడ్జస్టు చేసి 'ఖిలాడీ' సినిమా నాలుగు షోలు ప్రదర్శిస్తే నష్టాలు లేకుండా బయటపడొచ్చు. ఇకపోతే ఫిబ్రవరి 11న రవితేజ సమర్పిస్తున్న 'ఎఫ్ ఐ ఆర్' అనే తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇలా ఒకేరోజు మాస్ రాజా నటించిన సినిమాతో పాటుగా ఆయన ప్రెజెంట్ చేస్తున్న మూవీ కూడా థియేటర్లోకి వస్తుండటం విశేషం.
Tags:    

Similar News