నాగ్ 100వ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ చేతిలో పెడతాడా..?

Update: 2022-11-21 14:30 GMT
కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఏడాది ప్రారంభంలో 'బంగార్రాజు' సినిమాతో సక్సెస్ అందుకున్నారు. 'బ్రహ్మాస్త్రం' చిత్రంతో చాలా గ్యాప్ తర్వాత నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న నాగ్.. దసరా సందర్భంగా రిలీజ్ చేసిన 'ది ఘోస్ట్' సినిమాతో నిరాశ పరిచారు. అయితే ఈ యాక్షన్ థ్రిల్లర్ ని నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసిన తర్వాత అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది.

కానీ ఓవైపు మిగతా సీనియర్ హీరోలంతా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ కొడుతుంటే.. నాగార్జున మాత్రం తన రేంజ్ కు తగ్గ విజయాన్ని అందుకోలేకపోతున్నారని అక్కినేని అభిమానులు నిరాశకు గురవుతున్నారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ తో బిగ్ సక్సెస్ అందుకుని సత్తా చాటాలని కోరుకుంటున్నారు. అది కూడా మైలురాయి 100వ చిత్రం కావడంతో ప్రతిష్టాత్మకంగా ఉండాలని ఆశిస్తున్నారు.

కింగ్ నూరవ సినిమా గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎలాంటి కథని ఎంచుకుంటారు? డైరెక్టర్ ఎవరు?  అనౌన్స్ మెంట్ ఎప్పుడు? అంటూ అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ సినీ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇంతవరకూ నాగ్ తదుపరి సినిమా విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు కింగ్ 100వ ప్రాజెక్ట్ ని ఓ డెబ్యూ డైరెక్టర్ చేతిలో పెట్టబోతునట్లు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.

నాగార్జున కెరీర్ ప్రారంభం నుంచి కూడా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వస్తున్నారు. గీతా కృష్ణ - రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి కళ్యాణ్ కృష్ణ కురసాల - అహిషోర్ సోలమన్ వరకు ఎందరో డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ కు కూడా నాగ్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి చిత్రాలకు రైటర్ గా పని చేసిన బెజవాడ ప్రసన్న.. ప్రస్తుతం 'ధమాకా' మరియు 'దాస్ కా ధమ్కీ' చిత్రాలకు కథ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే రచయిత ఇటీవల నాగార్జున ను ఓ కథ వినిపించగా గపాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందట. దీని కోసం కొందరు దర్శకులను సంప్రదించిన కింగ్.. చివరకు ప్రసన్ననే డైరెక్ట్ చేయమని చెప్పారట.

నాగ్ టాలీవుడ్ కు మరో కొత్త దర్శకుడిని పరిచయం బాగానే ఉంది కానీ.. తన కెరీర్ లో మైల్ స్టోన్ 100వ చిత్రాన్ని ఎలాంటి అనుభవం లేని డైరెక్టర్ చేతిలో పెట్టడమే ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. కొత్త దర్శకులు లేదా అవుట్ డేటెడ్ డైరెక్టర్లతో కాకుండా.. ఓ స్టార్ డైరెక్టర్ తో పక్కా మాస్ మసాలా మూవీ చేయాలని కోరుకుంటుంటే.. తమ అభిమాన హీరో ఇలా చేస్తున్నారేంటని ఆలోచిస్తున్నారు.

అయితే బెజవాడ ప్రసన్న కుమార్ కు నాగ్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తున్నాడో లేదో తెలియదు కానీ.. తన ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఒక కొత్త దర్శకుడి చేతిలో పెట్టకపోవచ్చని కొందరు అభిమానులు భావిస్తున్నారు. కింగ్ వందవ ప్రాజెక్ట్ గా తన ఫిల్మోగ్రఫీలో మెమొరబుల్ గా నిలిచిపియే సినిమా చేస్తారని.. అది కచ్చితంగా ఒక ప్రముఖ దర్శకుడితోనే ఉంటుందని ఆశిస్తున్నారు.

నిజానికి 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున సినిమా ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు సైతం దీనిని ధృవీకరించారు. అంతేకాదు ఇందులో నాగ్ తో పాటుగా తనయుడు అఖిల్ అక్కినేని కూడా నటిస్తారని టాక్ వచ్చింది. మరి త్వరలోనే కింగ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించి రూమర్స్ అన్నిటికీ చెక్ పెడతారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News