ఏపీలో టికెట్ ధరల విషయంలో ఎన్టీఆర్ సాయం తీసుకుంటారా..?

Update: 2021-12-11 07:35 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ - థియేటర్స్ సమస్యలపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో సినిమా టికెట్ ధరలు తగ్గించడం.. అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడంపై పునరాలోచించుకోవాలని ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. దీని ప్రకారం ఇకపై బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలకు అనుమతి ఉండదు. ప్రజలకు వినోదాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో టికెట్ రేట్లు తగ్గించామని పేర్కొన్నారు. అలానే సినిమా టికెట్ ఆన్ లైన్ బుకింగ్ సిస్టమ్ ని ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు.

అయితే బిల్లులోని ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని స్వాగతిస్తున్న సినీ పెద్దలు.. టికెట్ రేట్లు తగ్గించడాన్ని - అదనపు షోలకు అనుమతి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం పెద్ద సినిమాలు తీసే నిర్మాతలకు థియేటర్లకు నష్టాన్ని కలిగించేలా ఉందని అభిప్రాయ పడుతున్నారు.

ఇప్పుడు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై పలువురు సినీ ప్రముఖులు ఓపెన్ గానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా 'ఆర్.ఆర్.ఆర్' ప్రొడ్యూసర్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దానయ్య టికెట్ ఇష్యూ పై స్పందించారు. RRR ట్రైలర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. ఏపీలో సినిమా టిక్కెట్ రేట్స్ తప్పకుండా సినిమా కలెక్షన్స్‌ పై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు.

'సినిమా టికెట్‌ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలెక్షన్స్‌ పై ప్రభావం చూపే అవకాశం ఉందా?' అని శుక్రవారం బెంగుళూరులో విలేకరులు ప్రశ్నించగా.. ''తప్పకుండా సినిమా వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సినిమా టికెట్ ధరల విషయంపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఎక్కువ షోలు ప్రదర్శించే విధంగా మాట్లాడుతున్నాం'' అని దానయ్య చెప్పారు.

అలానే ఈరోజు శనివారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో దానయ్య మరోసారి దీనిపై స్పందించారు. 'ఏపీలో సినిమా టికెట్‌ ధరల విషయంలో మీరు ఎన్టీఆర్‌ సాయం ఏమైనా తీసుకుంటారా? ఎందుకంటే ఎన్టీఆర్‌ కు సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు అక్కడ మంచి స్థాయిలో ఉన్నారు కదా?' అని ప్రశ్నించగా.. ''సినిమా టికెట్‌ ధరల విషయంపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నాం'' అని దానయ్య తెలిపారు.


Tags:    

Similar News