నెట్ ఫ్లిక్స్ క‌ష్టం రాజ‌మౌళి తీర్చేనా?

Update: 2022-06-11 23:30 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా త‌న కెరీర్ నే ప‌నంగా పెట్టి చేసిన మూవీ 'బాహుబ‌లి', బాహుబ‌లి 2. ఈ సీరీస్ మూవీస్ వ‌ర‌ల్డ్ వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ లుగా నిలిచి రాజ‌మౌళి న‌మ్మ‌కాన్ని నిజం చేయ‌డ‌మే కాకుండా యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు పేరు ప్ర‌ఖ్యాతుల్ని తెచ్చిపెట్టాయి. తెలుగు సినిమా అంటే యావ‌త్ ప్ర‌పంచం త‌లెత్తి ఆశ్చ‌ర్యంగా చూసేలా చేశాయి. ఇంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించిన ఊహాజ‌నిత మాహిష్మ‌తీ సామ్రాజ్యాన్ని మ‌రింత‌గా తెర‌పై ఆవిష్క‌రించాల‌ని ఆర్కా మీడియా వ‌ర్గాలు భావించాయి.

'బాహుబ‌లి ది బిగినింగ్‌' కి ముందు ఏం జ‌రిగింది అనే కోణంలో 'రైజ్ ఆఫ్ శివ‌గామి' పేరుతో అనంద్ నీల‌కంఠ‌న్ రాసిన బుక్ రైట్స్ ని వెబ్ సిరీస్ కోసం ఆర్కా మీడియా వ‌ర్గాలు నెట్ ఫ్లిక్స్ ని అమ్మేశాయి. 'బాహుబ‌లి బిఫోర్ ద బిగినింగ్ ' పేరుతో తెర‌పైకి తీసుకురావాల‌ని నెట్ ఫ్లిక్స్ భారీ ప్లాన్ చేసింది. 'బాహుబ‌లి' క్రేజ్ ని క్యాష్ చేసుకోవాల‌ని భారీ స్కెచ్ ని సిద్ధం చేసి ద‌ర్శ‌కులుగా దేవా క‌ట్టా, ప్ర‌వీణ్ స‌త్తారు ల‌ని రంగంలోకి దింపింది.

అయితే ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు రూపొందించిన ఫైన‌ల్ ఔట్ పుట్ నెట్ ఫ్లిక్స్ వ‌ర్గాల‌కు ఏమాత్రం న‌చ్చ‌లేదు. వారి అంచ‌నాల‌కు ద‌రిదాపుల్లో కూడా లేక‌పోవ‌డంతో కోట్లు ఖ‌ర్చు చేసి షూట్ చేసిన ఫుటేజ్ ని అంతా ప‌క్క‌న ప‌డేశారట‌. చాలా రోజులుగా దీన్ని మ‌ళ్లీ తెర‌పైకి తీసుకురావాల‌ని నెట్ ఫ్లిక్స్ వ‌ర్గాలు విశ్వ‌ప్ర‌యత్నాలు చుస్తున్నాయ‌ట‌. రాజ‌మౌళి ప‌ర్య వేక్ష‌ణ‌లో అయితేనే అనుకున్న ఔట్ పుట్ వ‌స్తుంద‌ని భావించి ఆర్కామీడియా ద్వారా ఆయ‌న‌ని సంప్ర‌దించాల‌నుకున్నార‌ట‌.

అయితే అప్ప‌టికే అభిప్రాయ విభేధాల‌తో ఆర్కా వారికి రాజ‌మౌళి దూరంగా వుంటూ వ‌స్తున్నారు. దీంతో ఆర్కా వారి ద్వారా జ‌క్క‌న్న‌ని క‌లిసే మార్గం లేక‌పోవ‌డంతో నేరుగానే రాజ‌మౌళిని సంప్ర‌దించి ఈ ప్ర‌తిష్టాత్మ‌క వెబ్ సిరీస్ కి షో ర‌న్న‌ర్ గా వుండాల‌ని కోరాల‌నుకుంటున్నార‌ట‌. అయితే 'ట్రిపుల్ ఆర్' త‌రువాత జ‌క్క‌న్న‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ భారీ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చేయ‌డానిక రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నెట్ ఫ్లిక్స్ కు అందుబాటులో వుండే అవ‌కాశం లేదు. అంతే కాకుండా ఇటీవ‌ల చేసిన 'ట్రిపుల్ ఆర్‌' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నేప‌థ్యంలో హాలీవుడ్ న‌టులు, టెక్నిషియ‌న్ ల దృష్టిని కూడా రాజ‌మౌళి ఆక‌ర్షించి వారి ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్నారు. సినిమాపై వ‌ర‌ల్డ్ వైడ్ గా ఇత‌ర దేశాల ప్రేక్ష‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌మౌళి నెట్ ఫ్లిక్స్ కోసం వెబ్ సిరీస్ చేయ‌డానికి రెడీ అవుతాడ‌న్న‌ది క‌లే.

అయితే క‌నీసం ఆయ‌న స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో అయినా 'బాహుబ‌లి బిఫోర్ ద బిగినింగ్ ' ని మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించాల‌న్న నెట్ ఫ్లిక్స్ ప్ర‌య‌త్నం ఫ‌లించేనా? .. రాజ‌మౌళి వారి క‌ష్టాన్ని తీర్చేనా అన్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News