ఈ ఫేడ‌వుట్ డైరెక్ట‌ర్లు మ‌ళ్లీ రాణిస్తారా?

Update: 2023-01-12 23:30 GMT
ఇండ‌స్ట్రీలో క్రియేటివిటీకి, స‌క్సెస్ కే తొలి ప్ర‌ధాన్య‌త ఇస్తుంటారు. అది వున్నంత వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రికీ విలువ ఇక్క‌డ‌. అది కాస్తా చేయి జారిందా.. ఇక్క‌డ ప‌ట్టించుకునే వాడే వుండడు.. ఫోన్ ఎత్తేవాడే వుండ‌డు. గ‌తంలో స‌క్సెస్ లో వున్నప్పుడు వెంట తిరిగి ఆహా ఓహో.. సూప‌ర్ డూప‌ర్ అన్నవాడు ఆ త‌రువాత స‌క్సెస్ చేయి జారిందో కంటికి కూడా క‌నిపించ‌డు. స‌క్సెస్ మాత్ర‌మే మాట్లాడే ఈ ఇండ‌స్ట్రీలో ఒక్క సారి ఫేడౌట్ అయ్యారో మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి రావ‌డం క‌ష్టం.

అయితే ఇప్ప‌డు ఇండ‌స్ట్రీలో వ‌రుస ఫ్లాపుల‌తో ఫెడ‌వుట్ అయిన‌ కొంత మంది ద‌ర్శ‌కులు మ‌ళ్లీ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ బి. గోపాల్‌. గ‌తంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, మెగాస్టార్ చిరంజీవిల‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించ‌డ‌మే కాకుండా సీమ ఫ్యాక్ష‌న్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచారు. నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `స‌మ‌ర సింహారెడ్డి`, `న‌ర‌సింహ నాయుడు` వంటి సంచ‌ల‌న చిత్రాల‌ని అందించి రికార్డులు తిర‌గ‌రాశారు.

ఇక చిరంజీవితో స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు, ఇంద్ర వంటి హిట్ సినిమాల‌ని అందించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌ని అందించిన ట్రాక్ రికార్డ్ వున్న బి. గోపాల్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్నారు. గోపీచంద్ తో చేసిన `ఆర‌డుగుల బుల్లెట్` తో భారీ డిజాస్ట‌ర్ ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా బాల‌య్య‌తో చేసిన `ప‌ల్నాటి బ్ర‌హ్మ‌నాయుడు` మూవీతో విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అప్ప‌టి నుంచి బి. గోపాల్ కు సినిమా ఇచ్చిన వాళ్లు లేరు.

అయితే ఈ మ‌ధ్య నంద‌మూరి బాల‌కృష్ణ‌తో బి. గోపాల్ సినిమా చేయాల‌నే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం వున్న అడ్వాన్స్డ్ ట్రెండ్ లో ఔట్ డేటెడ్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిన బి. గోపాల్ అవ‌కాశం ద‌క్కినా మ‌ళ్లీ ఆ స్థాయిలో ఆక‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే ద‌ర్శ‌కుడి త‌ర‌హాలో మ‌రో ఇద్ద‌రు ద‌ర్శ‌కులు కూడా త‌మ అదృష్టాన్ని కుర్ర హీరోల సినిమాల‌తో ప‌రీక్షించుకోబోతున్నారు.

`మ‌న‌సంతా నువ్వే` సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్న వీ.ఎన్‌. ఆదిత్య మ‌ళ్లీ డైరెక్ట‌ర్ గా మెగా ఫోన్ ప‌ట్ట‌బోతున్నార‌ట‌. ఓ యంగ్ హీరోతో సినిమాకు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌. 2007లో సిద్ధార్ధ్ హీరోగా రూపొందిన `ఆట‌` త‌రువాత ఫామ్ కోల్పోయిన వీ.ఎన్‌. ఆదిత్య మ‌ళ్లీ డైరెక్ట‌ర్ గా రాణించ‌గ‌ల‌రా, ప్ర‌స్తుత పోటీకి అనుగుణంగా సినిమాలు చేయ‌గ‌ల‌రా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే త‌ర‌హాలో ఏ.ఎస్‌. ర‌వికుమార్ కూడా మ‌ళ్లీ డైరెక్ట‌ర్ గా రంగంలోకి దిగ‌బోతున్నాడ‌ట‌. త‌ను కూడా యంగ్ హీరోనే న‌మ్ముకున్నాడ‌ని చెబుతున్నారు.

వీరితో పాటు ద‌శ‌ర‌థ్ కూడా మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని తెలుస్తోంది. చాలా ఏళ్లుగా డైరెక్ష‌న్ కు దూరంగా వుంటూ వ‌స్తున్నా ఈ ద‌ర్శ‌కులు ఇప్పుడున్న పోటీకి త‌గ్గ‌ట్టుగా క్రియేటివ్ థాట్స్ తో సినిమాలు చేస్తారా?.. చేసి నిల‌బ‌డ‌తారా? అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో గుస గుస‌లు వినిపిస్తున్నాయ‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News