ఆర్.ఆర్.ఆర్ సినిమాని ప్రకటించింది మొదలు దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఒక యజ్ఞంలా భావించి పని చేస్తున్నారు. ఆన్ లొకేషన్ బస ఏర్పాటు చేసుకుని మరీ హార్డ్ వర్క్ చేస్తున్నాడు. 2020 జూలై 30న రిలీజ్ అంటూ ఆరంభమే ప్రకటించారు. అందుకు తగ్గట్టే డెడ్ లైన్ ప్రకారం ప్రతిదీ ప్లాన్ చేసి పూర్తి చేస్తున్నారు. ఆ క్రమం లోనే జక్కన్న కమిట్ మెంట్.. డెడికేషన్ పై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక తనతో పాటే కథా నాయకులు రామ్ చరణ్ - ఎన్టీఆర్ సైతం అంతే కమిట్ మెంట్ తో వర్క్ చేస్తుండడం ఉత్కంఠ పెంచుతోంది.
ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్ర లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నారు. నైజాం విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్ర లో ఎన్టీఆర్ నటిస్తున్నారు. చరణ్ సరసన ఆలియాభట్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ-ఆలియా కాంబో సన్నివేశాల్ని ఇదివరకూ తెరకెక్కించారు. అయితే ఎన్టీఆర్ సరసన నటించాల్సిన కథానాయిక ఎవరు? అన్నది ఇప్పటికీ తేలలేదు. ఇంతకు ముందు హాలీవుడ్ నటి ఎడ్గార్ జోన్స్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న తర్వాత వేరొక కథానాయిక కోసం రాజమౌళి అండ్ టీమ్ సెర్చ్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పటివరకూ తారక్ సరసన ఎవరు నటిస్తున్నారు? అన్నది ప్రకటించలేదు. ఓ వైపు షూటింగ్ వేగంగా పూర్తవుతున్నా.. ఎందుకని నాయికను ఫైనల్ చేయలేదు అంటూ ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చ సాగింది.
ఎట్టకేలకు తారక్ కి కథానాయిక దొరికిందని తెలుస్తోంది. ఫిక్షన్ కథాంశం ప్రకారం కొమురం భీమ్ పాత్రధారి విదేశీ అమ్మాయి తో రొమాన్స్ చేయాల్సి ఉంటుంది. ఆ లుక్ ఆ పాత్రకు అవసరం కాబట్టి ఆస్ట్రేలియన్ నటి జోసెఫీన్ లాంగ్ ఫోర్డ్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఐరిష్ మూలాలున్న ఈ ఆస్ట్రేలియన్ బ్యూటీ తారక్ సరసన నటించేందుకు అంగీకరించింది. ఇక ఇదే చిత్రంలో విలన్ గానూ మరో ఐరిష్ బ్యూటీ అలీసన్ డూడీని ఎంపిక చేశారు. ఇండియానా జోన్స్ - ది లాస్ట్ క్రూసేడ్ చిత్రంలో నటించిన ఈ అమ్మడు 2017లో డివిజన్ 19 అనే హాలీవుడ్ చిత్రంలోనూ నటించింది. ఇక ఈ ఇద్దరు విదేశీ భామలు సెట్స్ లో జాయిన్ కాకముందే ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ 70 శాతంవరకూ పూర్తయిపోవడం ఆశ్చర్యకరమే. ఇక ఈ విదేశీ ముద్దుగుమ్మలు జాయిన్ అయితే పెండింగ్ చిత్రీకరణలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు జక్కన్న అండ్ టీమ్ షెడ్యూల్స్ ని పక్కాగా ఫిక్స్ చేశారట. తాజా చేరికల పై ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి సమాచారం అందింది.