కింగ్ వారసుడు గనుక స్టార్లు సహకరిస్తున్నారా?
తొలి ప్రయత్నమే అతడు నెట్ ఫ్లిక్స్ కోసం 6 ఎపిసోడ్ ల భారీ వెబ్ సిరీస్ తో వస్తున్నాడు. పైగా అతడు ఈ వెబ్ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్న కాన్వాస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
చాలామంది హీరోల వారసులు తండ్రిలానే వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్టార్లుగా ఏలాలని కలలు కంటుంటారు. కానీ కింగ్ ఖాన్ షారూఖ్ వారసుడు ఆర్యన్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అతడు కెమెరా వెనక టెక్నీషియన్ అవ్వాలని కలలు కంటున్నాడు. దర్శకుడిగా నిరూపించుకోవాలని పంతం పడుతున్నాడు. తొలి ప్రయత్నమే అతడు నెట్ ఫ్లిక్స్ కోసం 6 ఎపిసోడ్ ల భారీ వెబ్ సిరీస్ తో వస్తున్నాడు. పైగా అతడు ఈ వెబ్ సిరీస్ కోసం ఎంపిక చేసుకున్న కాన్వాస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
స్టార్ డమ్ పేరుతో ఆర్యన్ ఖాన్ రూపొందిస్తున్న వెబ్ సిరీస్ వచ్చే ఏడాది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. ఈ సిరీస్ ఆద్యంతం ఒక కొత్త యువకుడు సినీరంగంలో ఎదగాలనే పట్టుదలతో ఎలాంటి ప్రయత్నం సాగించాడనే థీమ్ లైన్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో ప్రతి ఎపిసోడ్ ని కలర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నాడు ఆర్యన్. పనిలోపనిగా అతడు రూపొందించిన అవార్డుల కార్యక్రమ సన్నివేశం వెబ్ సిరీస్‌లో ప్రధాన హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
దీనికి కారణం `ఓం శాంతి ఓం` తరహాలో ఎపిసోడ్ ఆద్యంతం స్టార్లతో కళకళలాడుతుందని తెలిసింది. అది అవార్డుల షో. అక్కడ తారలంతా సందడిగా కనిపిస్తారు. షారూఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ స్టార్లు అవార్డుల కార్యక్రమ సన్నివేశంలో ఉల్లాసంగా కనిపిస్తారు. సారా అలీ ఖాన్, అర్జున్ కపూర్, రాజ్‌కుమార్ రావు సహా 18 మంది స్టార్లతో అవార్డు షో సీక్వెన్స్ తెరకెక్కుతోందని సమాచారం. ఆర్యన్ పిలిచిన స్టార్లు అంతా వచ్చి నటించి వెళుతున్నారట. ఇప్పటికే పలువురిపై కీలక సీన్ షూటింగ్ పూర్తి చేసారని తెలిసింది. ఈ ఆదివారంతో షూటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని కూడా తెలుస్తోంది.
అయితే వెబ్ సిరీస్ లో అవార్డుల షో ఐడియా ఆర్యన్ కి ఎలా వచ్చింది? అంటే.. తన తండ్రి గారైన షారూఖ్ నటించిన క్లాసిక్ హిట్ మూవీ `ఓంశాంతి ఓం` లోని అవార్డుల సన్నివేశమే స్ఫూర్తి అంటూ గుసగుస వినిపిస్తోంది. నిజానికి ఫరాఖాన్ రూపొందించిన ఓంశాంతి ఓం లో స్టార్లందరితో కన్నుల పండుగగా సాగే అవార్డుల కార్యక్రమం ఎపిసోడ్ గొప్పగా రక్తి కట్టిస్తుంది. మొత్తం 31 మంది స్టార్‌లతో దీవాంగి పాట కలర్ ఫుల్ గా సాగుతుంది. ఇప్పుడు వెబ్ సిరీస్ లోను అలాంటి కలర్ ఫుల్ సీన్లతో ఆర్యన్ కట్టిపడేసే ప్లాన్ చేసాడని తెలుస్తోంది. మొత్తం పరిశ్రమ ప్రముఖ తారలందరినీ ఓ చోట చేర్చడం అంటే ఆషామాషీ కాదు. రాజుగారే తలుచుకుంటే...! అన్న చందంగా కింగ్ ఖాన్ వారసుడి ప్రయత్నానికి ఇతర స్టార్లు అందరపూ `కుదరదు! సాధ్యపడదు!` అనకుండా సాయపడుతున్నారట. ఔట్ సైడర్ లేదా వేరొక దర్శకుడికి ఇది అంత సులువుగా సాధ్యపడేది కాదు.