కథ లీక్: సిద్ధార్థ్ పాత్రతో సేనాపతి కనెక్షన్?
శంకర్ మరోసారి తనదైన శైలిలో అవినీతి రాజకీయాలపై దృష్టి సారించారని, ఈ సినిమా కథాంశం అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'భారతీయుడు 2' (ఇండియన్ 2) మోస్ట్ అవైటెడ్ 2024 చిత్రంగా రికార్డుల్లో ఉంది. జూలై 12 రిలీజ్ తేదీ కావడంతో చిత్రబృందం ప్రచారంలో వేగం పెంచింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సేనాపతి పోస్టర్లు సంచలనం సృష్టించాయి. రిలీజైన పాటలు ప్రజల్లోకి దూసుకెళ్లాయి. శంకర్ మరోసారి తనదైన శైలిలో అవినీతి రాజకీయాలపై దృష్టి సారించారని, ఈ సినిమా కథాంశం అద్భుతంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
తాజాగా 'ఇండియన్ 2' కథ లీకైంది అంటూ ఒక ప్రచారం వేడెక్కించేస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే యువకుడికి (సిద్ధార్థ్) మద్దతుగా పోరాడటానికి సేనాపతి (కమల్ హాసన్) భారతదేశానికి తిరిగి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది పెద్ద తెరపైనే చూడాలి! అంటూ తమిళ మీడియాలు కథనాలు వండి వార్చాయి. ఒక క్లిష్ట పరిస్థితి నుండి సిద్ధార్థ్‌ను రక్షించడానికి సేనాపతి తిరిగి వస్తాడు. భ్రష్టు పట్టిన రాజకీయాలపై శంకర్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెరపై కనిపిస్తుంది! అంటూ ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కంటెంట్ పరంగా వివాదాలు చెలరేగేందుకు ఆస్కారం లేకపోలేదని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇండియన్ 2 ఆడియో లాంచ్ చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు అటెండయ్యారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించిన సంగతి తెలిసిందే. పాటలకు స్పందన బావుంది.