గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న తమిళ హీరో

రెండు వారాలు లేటుగా ఈ శుక్రవారం అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయాలనుకున్నారు.

Update: 2024-01-26 14:34 GMT

వీడియో జాకీగా మొదలుపెట్టి తమిళంలో పెద్ద స్టార్ గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. నెమ్మదిగా అతను తెలుగులో కూడా మార్కెట్, ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వరుణ్ డాక్టర్, ప్రిన్స్, మహావీరుడు లాంటి చిత్రాలు అతనికి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అతను నటించిన కొత్త చిత్రం అయలాన్ ను తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు దొరక్క కేవలం తమిళ వెర్షన్ మాత్రమే రిలీజ్ అయింది. రెండు వారాలు లేటుగా ఈ శుక్రవారం అయలాన్ తెలుగు వెర్షన్ రిలీజ్ చేయాలనుకున్నారు. పబ్లిసిటీ, ప్రమోషనల్ ఈవెంట్లు గట్టిగానే చేశారు. శివకార్తికేయన్ హైదరాబాద్ వచ్చి మరి ప్రి రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడమే కాక మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇదంతా చేసి బజ్ తీసుకొచ్చారు కానీ.. ఈరోజు అనుకున్న ప్రకారం సినిమాను రిలీజ్ చేయలేకపోయారు.

అయలాన్ తమిళ నిర్మాతకు చెన్నైలో ఏవో లీగల్ ఇష్యూస్ తలెత్తి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వర్షన్ రిలీజ్ కాలేదు. మధ్యాహ్నం తర్వాత అయినా సమస్య పరిష్కారమై ఈవినింగ్ అయినా షోలు మొదలుతాయి అనుకుంటే అందుకు ఛాన్స్ లేదని తెలిసింది. శనివారం అయినా సినిమా రిలీజ్ అవుతుందో లేదో క్లారిటీ లేదు. నిజానికి అయలాన్ చిత్రానికి మంచి టైమింగ్ కుదిరింది. సంక్రాంతి సినిమాల్లో హనుమాన్ తప్ప అన్ని జోరు తగ్గించేశాయి. ఈ వారం రిలీజ్ అయిన రెండు డబ్బింగ్ సినిమాలు ఫైటర్, కెప్టెన్ మిల్లర్ డివైడ్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళంలో పెద్ద హిట్ అయిన అయలాన్ సినిమా శుక్రవారం రిలీజ్ అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. అనువాద చిత్రాలకు లాంగ్ రన్ కష్టం కాబట్టి ఓపెనింగ్ కీలకం. కానీ అక్కడే అయలాన్ కు దెబ్బ పడింది. శనివారం కూడా రిలీజ్ కాకపోతే అయలాన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయినట్లే.


Tags:    

Similar News