బన్నీతో సినిమా.. ఫైనల్ గా ఓపెన్ అయిన అట్లీ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత ఏ సినిమా చేస్తారా అనేది చాలా కాలం అభిమానుల్లో సస్పెన్స్ గా మారింది. ఇప్పటికైతే బన్నీ.. సందీప్ వంగా, త్రివిక్రమ్ ను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. అలాగే దర్శకుడు అట్లీ పేరు కూడా వినిపిస్తూనే ఉంది. రీసెంట్ గా జవాన్ హిట్ అయిన తర్వాత అట్లీ పేరు మరింత ఎక్కువగా వినిపిస్తోంది. మరీ ఈ ముగ్గురు దర్శకుల్లో బన్నీ.. మొదట ఎవరితో చేస్తారో ఇప్పటికైతే పక్కా క్లారిటీ లేదు కానీ సందీప్ వంగా అని అంటున్నారు.
అయితే జవాన్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న అట్లీ.. ఎట్టకేలకు బన్నీతో సినిమాపై తాజాగా మాట్లాడాడు. అల్లు అర్జున్ తో చర్చలు జరిగిన విషయం నిజమేనని స్పష్టత ఇచ్చాడు. ఇద్దరు కలిసి ఓ మంచి స్టోరీ పాయింట్ పై డిస్కషన్ చేసినట్లు చెప్పాడు. "బన్నీ నాకు మంచి మిత్రుడు. మాలో ఉన్న టాలెంట్స్ ను ఒకరినొకరం ఇష్టపడతాం. మా ఇద్దరి మధ్య ఓ స్టోరీ ఐడియాపై చర్చ జరిగింది. ఎలా చేయాలి, ఏం చేయాలని చర్చించుకున్నాం. ఏ సినిమా కార్యరూపం దాల్చినా అది దేవుడి దయ అని భావిస్తాను. అలానే బన్నీ సినిమాకు కూడా దేవుడి దయ కలిసి రావాలి అంతే." అని అట్లీ పేర్కొన్నారు.
కానీ అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా పక్కా.. జవాన్ కు మించి ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తన తదుపరి సినిమాకు కాస్త సమయం పడుతుందని అన్నారు. జవాన్ సక్సెస్ తో తనపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పుకొచ్చారు.
"జవాన్ విజయం నుంచి బయటకు రావడానికి నాకు కాస్త సమయం పడుతుంది. ఈ సినిమా విజయం నాపై బాధ్యతను పెంచింది. ఇండియా వైడ్ గా ఉన్న ఆడియెన్స్ ను నేను సంతృప్తి పరచాలి. నా తదుపరి చిత్రాన్ని గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్తాను. జవాన్ కన్నా పెద్దగా ఏదైనా చేస్తాను. ఇప్పటికైతే నా కొడుకుతో కొంత సమయం గడుపుతాను. ఆ తర్వాతే కొత్త సినిమా కథను రాస్తాను " అని అట్లీ అన్నారు.
దీని బట్టి చూస్తే.. అట్లీతో సినిమాను ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది బన్నీపైనే డిసైడ్ అయి ఉందని అర్థమైంది. కాబట్టి.. సందీప్ వంగాతో చిత్రం అయ్యాక.. త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్తారా లేదా అట్లీతోనా అనేది చూడాలి..