స‌క్సెస్ చాలా చెడ్డ‌ది..మ‌న‌లో ఆ ద‌మ్ముండాలి!

స‌క్సెస్..ఫెయిల్యూర్ పై ఒక్కొక్క‌రిది ఒక్కో అభిప్రాయం. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం అన్న‌ది అతిముఖ్యంగా అంతా చెబుతారు.

Update: 2024-07-02 06:29 GMT

స‌క్సెస్..ఫెయిల్యూర్ పై ఒక్కొక్క‌రిది ఒక్కో అభిప్రాయం. కానీ ఆ రెండింటినీ బ్యాలెన్స్ చేయ‌డం అన్న‌ది అతిముఖ్యంగా అంతా చెబుతారు. విజ‌యంతో పొంగిపోకూడ‌దు...అప‌జ‌యంతో కృంగిపోకూడ‌దు. రెండింటీని మ‌ధ్య‌స్తంగా ఉండాల‌ని, ఫ‌లితం ఎలా వ‌చ్చినా స్వీక‌రించాల‌ని, త‌ప్పుల్ని దిద్దుకుంటూ ముందుకెళ్లాల‌ని చెప్పిన వాళ్లు ఎంతో మంది. అయితే బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా మాత్రం వాటికి భిన్నంగా స్పందించాడు.

విజ‌యం చాలా చెడ్డ‌దని, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మ‌రింత ప్ర‌మాదంలో ప‌డ‌తామ‌ని అన్నాడు. `ప‌రాజ‌యాలు ఎదుర్కునే సామ‌ర్ధ్యం ఉన్న‌వాళ్లే నిజ‌మైన న‌టులు. విజ‌యం చాలా చెడ్డ‌ది. వైఫల్యాలే మీకు స్నేహితులు. త‌త్వ‌వేత్త‌లు ప్రారంభ‌రోజుల్లో క‌ష్టాలు చూడ‌క‌పోతే భ‌విష్య‌త్ లో వాటిని అధిగ‌మించ‌డం కష్ట‌మ‌వుతుంది. నా తొలి సినిమా విక్కీ డోన‌ర్ త‌ర్వాత అన్నీ ప‌రాజ‌యాలే. తొలి విజ‌యంతో బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నా, ఆ త‌ర్వాత అన్నీ ప‌రాజ‌యాలే ఎదుర‌య్యాయి.

మ‌ళ్లీ స‌క్సెస్ అనే మాట విన‌డానికి కొన్నేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అందుకే స‌క్సెస్ అనేది నా దృష్టిలో చెడ్డ‌ది. విజ‌యం వ‌చ్చింద‌ని అస్స‌లు సంతోష ప‌డ‌ను. చూసి వ‌దిలేస్తా. ఫెయిల్యూర్ ఎదురైతే త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందో తెలుసుకుంటా. క‌చ్చితంగా తెలుసుకునే వ‌ర‌కూ ఆ ప్ర‌య‌త్నం ఆప‌ను. ఎందుకంటే త‌ప్పు జ‌రిగింది కాబ‌ట్టే సినిమా పోయింద‌ని బ‌లంగా న‌మ్ముతాను. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు రిపీట్ అయితే పైకి లేవ‌డం క‌ష్టం.

అందుకే త‌ప్పు గురించి చాలా డీప్ గా విశ్లేషిస్తా. ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే క‌థ‌లు ఎంచుకోవ‌డం ఎంతో ఉత్త‌మ‌మైనది. పాత్ర‌ల ప‌రంగా సాహ‌సాలు చేయాలి. కానీ అవి అతిగా ఉండ‌కూడ‌దు` అని అన్నాడు. గ‌త ఏడాది డ్రీమ్ గ‌ర్ల్ 2 తో మంచి విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇంత‌వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. స‌రైన క‌థ కుద‌ర‌కపోవ‌డంతోనే డిలే చేస్తున్నాడు.

Tags:    

Similar News