'భజే వాయు వేగం' మూవీ రివ్యూ

'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు.

Update: 2024-05-31 14:04 GMT

'భజే వాయు వేగం' మూవీ రివ్యూ

నటీనటులు: కార్తికేయ గుమ్మకొండ-ఐశ్వర్యా మేనన్-రాహుల్ టైసన్-తనికెళ్ల భరణి-రవిశంకర్-శరత్ లోహిత్స్వ-సుదర్శన్ తదితరులు

సంగీతం: రదన్

నేపథ్య సంగీతం: కపిల్ కుమార్

ఛాయాగ్రహణం: ఆర్డీ రాజశేఖర్

మాటలు: మధు శ్రీనివాస్

నిర్మాణం: యువి కాన్సెప్ట్స్

రచన-దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి

'ఆర్ఎక్స్ 100'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఆ తర్వాత సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. వరుస పరాజయాల తర్వాత అతను కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన సినిమా.. భజే వాయు వేగం. కొత్త దర్శకుడు ప్రశాంత్ రెడ్డి 'యువి' సంస్థలో రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిట్ కోసం కార్తికేయ నిరీక్షణకు ఈ చిత్రం తెరదించేలా ఉందా? తెలుసుకుందాం పదండి.

కథ: వెంకట్ (కార్తికేయ).. రాజు (టైసన్ రాహుల్) అన్నదమ్ములు. తండ్రి (తనికెళ్ల భరణి) కష్టపడి వాళ్లిద్దరినీ చదివించి పెంచి పెద్ద చేస్తాడు. కానీ క్రికెటర్ కావాలన్న వెంకట్ కల డబ్బు సమస్య వల్ల నెరవేరదు. రాజు కూడా ఒక వ్యక్తి చేతిలో మోసపోయి ఉద్యోగం కోల్పోతాడు. ఐతే ఇద్దరూ చిన్న పనులేవో చేసుకుంటూ.. కష్టంలో ఉన్న తండ్రికి నిజం చెప్పకుండా మేనేజ్ చేస్తుంటారు. ఐతే వెంకట్-రాజుల తండ్రి అనారోగ్యంతో ఆసుపత్రి పాలు కాగా సర్జరీ కోసం 20 లక్షలు అవసరమవుతాయి. ఆ ఖర్చు కోసం క్రికెట్ బెట్టింగ్ ఆడిన వెంకట్ డబ్బులు గెలిచినా.. అవతలి వ్యక్తులు మోసం చేయడంతో చేతిలో ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకుంటాడు. ఆ సమయంలోనే హైదరాబాద్ సిటీలో బెట్టింగ్ సహా అనేక దందాలు చేసే మేయర్ తమ్ముడు డేవిడ్ (రవిశంకర్) లగ్జరీ కారు వెంకట్-రాజుల చేతికి దొరుకుతుంది. కారు అమ్మి ఆ డబ్బులతో తండ్రికి సర్జరీ చేయించాలనుకుంటాడు వెంకట్. ఇంతలో ఆ కారులోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఆ రహస్యాలేంటి.. వాటి వల్ల వెంకట్-రాజు ఎలా చిక్కుల్లో పడ్డారు.. వాటి నుంచి బయటపడడానికి ఏం చేశారు.. ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ: సినిమాను ఎంత బాగా ఆరంభించినా.. మధ్యలో గాడి తప్పి.. ద్వితీయార్ధంలో ఉస్సూరుమనిపిస్తే చివరికి ప్రేక్షకుడు డీలా పడిపోతాడు. అదే సినిమాను నెమ్మదిగా ఆరంభించినా సరే.. మధ్యలో ఊపందుకుని సెకండాఫ్ కిక్కిచ్చేలా సాగితే ప్రేక్షకుడు ముందు దొర్లిన తప్పులను మన్నించేస్తాడు. థియేటర్ నుంచి పాజిటివ్ ఫీలింగ్ తో బయటికి వస్తాడు. 'భజే వాయు వేగం' దర్శకుడు ప్రశాంత్ రెడ్డి రెండో మార్గాన్నే ఎంచుకున్నాడు. 'భజే వాయు వేగం' మొదలైన తీరు.. ఒక దశ వరకు నడిచే వైనం చూస్తే.. ఇది సహనానికి పరీక్షగా నిలుస్తుందేమో అన్న సందేహాలు కలుగుతాయి. కానీ కథ ఒక మలుపు తిరిగే వరకు మామూలుగా అనిపించే ఈ చిత్రం.. తర్వాత ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తూ సాగుతుంది. టైటిల్లో ఉన్న వేగం నిజంగా సినిమాలోనూ కనిపించడంతో ద్వితీయార్ధం రయ్యిన సాగిపోతుంది. ముగింపులోనూ మెరుపులుండడంతో 'భజే వాయు వేగం'ను టైంపాస్ కు ఢోకా లేని చిత్రంగా చెప్పొచ్చు.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా భిన్నమైన అరంగేట్రం కోసం చూసే యువ దర్శకులు ఎక్కువగా ఎంచుకునేది క్రైమ్ కామెడీ లేదా క్రైమ్ తో ముడిపడ్డ యాక్షన్ థ్రిల్లర్. ప్రశాంత్ రెడ్డి రెండో దారిలోనే సాగిపోయాడు. ఒక సీరియస్ కథను చెబుతూ.. ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి అతను ప్రయత్నించాడు. హీరో.. అతడి సోదరుడి కష్టాలు చూపించడంతో మొదట్లోనే ఈ కథ సీరియస్ గా సాగుతుందని అర్థమైపోతుంది. కాకపోతే ఆరంభ సన్నివేశాలు మరీ నెమ్మదిగా.. కొంచెం డల్లుగా నడుస్తాయి. ఈ కథలో అస్సలు ఇమడని లవ్ స్టోరీ క ోసం కొంచెం సమయం పెట్టాడు దర్శకుడు. ఆ ట్రాక్ చిన్నదే అయినా ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా అందులో ఒక పాట పెట్టి ఇంకొంచెం టైం వేస్ట్ చేశాడు. కథలో పెద్దగా మలుపులేమీ రాకపోవడం.. హీరో తండ్రి అనారోగ్యం అంటూ సినిమా కష్టాలు చూపించడంతో 'భజే వాయు వేగం' ఒక మామూలు సినిమాలా కనిపిస్తుంది. ఐతే విలన్ పాత్ర రంగప్రవేశం.. అతడి కారును హీరో కొట్టేయడం దగ్గర కథ మలుపు తిరగడంతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మొదలవుతుంది. అసలు ఆ కారు కోసం విలన్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూనే.. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే ఇతర సన్నివేశాలతో కథనం మంచి ఊపులో సాగుతుంది.

'భజే వాయు వేగం' ఆకర్షణ అంతా ద్వితీయార్ధంలోనే ఉంది. గెస్సింగ్ లో ఉంచేలా కథ మలుపులు తిరుగుతూ సాగడం.. సన్నివేశాలు రయ్యిన పరుగెత్తడంతో ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. విలన్ పాత్రలో కొత్త కొత్త కోణాలను పరిచయం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. చివర్లో హీరో ఆడే గేమ్ కూడా మెప్పిస్తుంది. కొన్ని సీన్లు నాటకీయంగా అనిపించినా.. దాని గురించి ఎక్కువ ఆలోచించని విధంగా కథ పరుగులు పెట్టడంతో అది పెద్ద ఇబ్బంది కాదు. మరీ ప్రేక్షకులను ఉత్కంఠతో ఊపేసేంత థ్రిల్లింగ్ సీన్లు లేకపోయినా.. ఓ మోస్తరుగా ఎంగేజ్ చేయడంలో 'భజే వాయు వేగం విజయవంతమైంది. కార్తికేయ కొన్నేళ్ల నుంచి చేస్తున్న చిత్రాలతో పోలిస్తే ఇది డీసెంట్ అనిపిస్తుంది. తన పెర్ఫామెన్స్ కూడా బాగుంది. ముఖ్యంగా విలన్ పాత్ర చేసిన రవిశంకర్ సినిమాను నిలబెట్టడంలో కీలకమయ్యాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో విసిగిపోయి కొంచెం డిఫరెంట్ మూవీ చూడాలనుకునే వాళ్లు.. ముఖ్యంగా యూత్ ఈ సినిమాతో కనెక్ట్ అయ్యే అవకాశముంది. కానీ మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకూడదు.

నటీనటులు: కార్తికేయ చాన్నాళ్లకు తనకు సూటయ్యే పాత్రను.. కథను సెలక్ట్ చేసుకున్నాడు. క్రికెటర్ కావాలని ఆశపడి.. ఆ కల నెరవేరక రాజీ పడుతూ బతికే కుర్రాడి పాత్రలో కార్తికేయ బాగా ఒదిగిపోయాడు. ఎప్పట్లాగే తన లుక్ బాగుంది. క్రికెటర్ పాత్రకు తగ్గట్లు ఫిట్ గా కనిపించాడు. యువ ప్రేక్షకులు మెచ్చేలా ఎనర్జిటిగ్గా సాగింది తన పాత్ర. హీరో అన్న పాత్రలో చాన్నాళ్ల తర్వాత 'హ్యాపీ డేస్' ఫేమ్ టైసన్ రాహుల్ తెరపై మెరిశాడు. భయం భయంగా బతికే కుర్రాడి పాత్రకు అతను సూటయ్యాడు. తన పాత్ర పట్ల ప్రేక్షకుల్లో జాలి కలిగేలా నటించాడు. హీరోయిన్ ఐశ్వర్యా మేనన్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. మోడర్న్ లుక్ లో కనిపించే ఆమె.. బస్తీ అమ్మాయి పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. హీరో ఫ్రెండు పాత్రలో సుదర్శన్ బాగానే చేశాడు. పెర్ఫామెన్స్ పరంగా సినిమాలో ఎక్కువ మార్కులు దక్కించుకునేది మాత్రం విలన్ పాత్రలో చేసిన రవిశంకరే. తన వాయిస్ తోనే అతను విలనీ పండించాడు. నటన కూడా ఆకట్టుకుంటుంది. శరత్ లోహిత్స్వ కూడా తన పరిధిలో బాగానే నటించాడు.

సాంకేతిక వర్గం: 'భజే వాయు వేగం'లో టెక్నీషియన్ల పనితనం కనిపిస్తుంది. సినిమాలో పాటలకు ప్రాధాన్యం లేదు. రదన్ అందించిన ఒక్క పాట ఓకే అనిపిస్తుంది. కపిల్ కుమార్ బ్యాగ్రౌండ్ స్కోర్ మంచి ఊపులో సాగుతుంది. మూవీకి యాప్ట్ అనిపించే స్కోర్ ఇచ్చాడతను. ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో క్వాలిటీ కనిపించేలా యువి వాళ్లు సినిమాకు అవసరమైన మేర ఖర్చు పెట్టారు. డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి.. ఒక స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ గా 'భజే వాయు వేగం'ను మలచడానికి బాగానే కష్టపడ్డాడు. ఐతే అసలు కథలోకి ప్రేక్షకలను తీసుకెళ్లడానికి అతను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాడు. ఒకసారి కథలో ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యాక కథనాన్ని పరుగులు పెట్టించాడు. ద్వితీయార్ధంలో దర్శకుడి పనితనం కనిపిస్తుంది.

చివరగా: భజే వాయు వేగం.. టైంపాస్ జర్నీ

రేటింగ్-2.75/5

Tags:    

Similar News