ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న‌.. సాయంత్ర‌మే ప్ర‌క‌ట‌న‌?!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తేదేపా వ‌ర్గాలు ఆశిస్తున్నాయి.

Update: 2024-03-13 07:50 GMT

విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. ఇప్పుడు మోదీ ప్ర‌భుత్వానికి మ‌రోసారి సిఫార‌సులు అందాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కేబినెట్ లో మంత్రి వ‌ర్గ స‌మావేశం చివ‌రి రోజైన నేడు 'ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న' గురించి కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. ప్ర‌ధాని మోదీకి ఇప్ప‌టికే అన్ని వ‌ర్గాల నుంచి సిఫారసులు అందాయి. ఆయ‌న ఇదే విష‌యంపై రాష్ట్ర‌ప‌తికి సిఫార‌సు చేస్తార‌ని అంతా భావిస్తున్నారు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు ముందు మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తేదేపా వ‌ర్గాలు ఆశిస్తున్నాయి. ఇటీవ‌ల ఏపీ ఎన్నిక‌ల కోసం తెలుగు దేశం పార్టీతో భాజ‌పా జ‌త‌క‌ట్టిన నేప‌థ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న మ‌రోసారి విస్త్రతంగా తెర‌పైకి వ‌చ్చింది. ఎన్నిక‌ల కోడ్ రాక ముందే, చివ‌రి కేబినెట్ స‌మావేశంలో మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని ఊహిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి కేంద్ర కేబినెట్ నిర్ణ‌యం ఏమిట‌న్న‌ది తేల్తుంద‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

ఈ ఏడాది ఐదుగురు ప్ర‌ముఖుల‌కు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించారు. వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తో పాటు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్‌లకు భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు మ‌రో ఇద్ద‌రికి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికి 53 మందికి భార‌త‌ర‌త్న ఇచ్చారు. ఒక‌వేళ కేంద్రం ఎన్టీఆర్ కు కూడా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టిస్తే అత‌డు 54వ వ్య‌క్తి అవుతార‌ని చెబుతున్నారు. ఇప్పటివ‌ర‌కూ ఇవ‌న్నీ ఊహాగానాలు మాత్ర‌మే. దీనిని అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది.

లెజెండ‌రీ న‌టుడు, ప్ర‌జా నాయ‌కుడు అయిన ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇచ్చేందుకు కేంద్రం కొన్ని ద‌శాబ్ధాలుగా చొర‌వ చూప‌లేద‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఎన్టీఆర్ కు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని మెగాస్టార్ చిరంజీవి అంత‌టి వారు బ‌హిరంగ వేదిక‌ల‌పై కోరారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానుల‌తో పాటు నాయ‌కులు, ప్ర‌ముఖులు వేదిక‌ల‌పై ఎన్టీఆర్ భార‌త‌ర‌త్న గురించి ప్ర‌స్థావించారు. కేంద్రాన్ని గొంతెత్తి అడిగారు. కానీ అది ఇంత‌కాలం ఫ‌లించ‌లేదు.. ఇప్పుడు మోదీ ప్ర‌భుత్వం అయినా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టిస్తే చూడాల‌ని తెలుగువారంతా ఆశ‌గా వేచి చూస్తున్నారు.

Tags:    

Similar News