ఆ రెండూ కోల్పోక‌పోతే భూమిక ఫేట్ మ‌రోలా!

ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర న‌టీమ‌ణులుగా చెప్పుకునే ప‌లువురికి భూమిక కోల్పోయిన సినిమాల‌తోనే గొప్ప స్టార్ డ‌మ్ ద‌క్కింది. ఇంకాస్త డీటెయిల్డ్ గా వివ‌రాల్లోకి వెళితే..

Update: 2024-10-16 02:45 GMT

న‌టి భూమిక త‌న కెరీర్ కీల‌క ద‌శ‌లో అత్యంత ముఖ్య‌మైన సినిమాల‌(అవ‌కాశాల‌)ను కోల్పోవ‌డం త‌న కెరీర్ కి తీర‌ని న‌ష్టంగా మారిందా? అంటే... అవున‌నే భావించాలి. ఇప్పుడు బాలీవుడ్ లో అగ్ర న‌టీమ‌ణులుగా చెప్పుకునే ప‌లువురికి భూమిక కోల్పోయిన సినిమాల‌తోనే గొప్ప స్టార్ డ‌మ్ ద‌క్కింది. ఇంకాస్త డీటెయిల్డ్ గా వివ‌రాల్లోకి వెళితే..

అందాల న‌టి భూమిక ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో యువ‌కుడు, ఖుషి, అన‌సూయ‌, మిస్స‌మ్మ‌ వంటి చిత్రాల్లో అద్భుత న‌ట‌న‌తో క‌ట్టి ప‌డేసిన ఈ బ్యూటీ, కొంత గ్యాప్ వ‌చ్చాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగాను కొన‌సాగింది. కానీ ఇటీవ‌ల భూమిక తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ప‌రిమితంగానే క‌నిపిస్తోంది. నిజానికి భూమిక అరుదైన ప్ర‌తిభావ‌ని. బ‌హుభాష‌ల‌తో అనుబంధం ఉన్న న‌టి భూమిక‌. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, పంజాబీ ప‌రిశ్ర‌మ‌ల‌తో భూమిక‌కు అనుబంధం ఉంది. పలు చిత్ర పరిశ్రమలలో తనదైన అందం ప్ర‌తిభ‌తో ఆక‌ట్టుకుంది. హిందీలో కెరీర్ ఆరంభం 'తేరే నామ్'లో తన నటనకు అద్భుత‌మైన గుర్తింపును పొందింది. ఇది ఆమె అత్యంత ప్రసిద్ధ ప్రదర్శనలలో ఒకటిగా మిగిలిపోయింది. అయితే సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ చిత్రం 'తేరే నామ్'లో నిర్జరా పాత్రతో బాగా పేరు పొందిన భూమిక చావ్లా త‌న కెరీర్ లో కొన్ని కీల‌కమైన అవ‌కాశాల‌ను చివ‌రి నిమిషంలో కోల్పోయాన‌ని తెలిపారు. జబ్ వి మెట్, మున్నా భాయ్ MBBS చిత్రాలలో త‌న స్థానంలో ఇత‌ర న‌టీమ‌ణుల‌ను భర్తీ చేయడం గురించి వెల్ల‌డించింది.

ఆర్.జే. సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతియాజ్ అలీ చిత్రం 'జబ్ వి మెట్'లో కరీనా కపూర్ తన స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రమే తాను నిరాశకు గురయ్యానని, ఇలాంటి మ‌రిన్ని అవ‌కాశాల‌ను ఇత‌రుల‌కు కోల్పోయాన‌ని భూమిక వెల్ల‌డించింది. సంజయ్ దత్ న‌టించిన 'మున్నా భాయ్ MBBS'లో తన స్థానంలో గ్రేసీ సింగ్‌ని తీసుకున్నట్లు భూమిక వెల్లడించింది. జబ్ వి మెట్ అవ‌కాశం కోల్పోయిన‌ప్పుడు మాత్రమే నేను బాధపడ్డాను. అది ఎందుక‌నో మిస్స‌య్యాను. ఈ సినిమాకి ఎంపిక చేసుకున్న వారిలో నేను మొదటి ఆర్టిస్టు.. త‌ర్వాత‌ బాబీ (డియోల్) ఎంపిక‌య్యాడు. షాహిద్ (కపూర్) - నేను చేయాలి.. కానీ ఆపై షాహిద్- అయేషా (టాకియా) అన్నారు. ఆపై షాహిద్ - కరీనా (కపూర్).. చివ‌రికి ఇది ఓకే అయింది... అని తాను ఎలా అవ‌కాశం కోల్పోయిందో తెలిపింది. అయితే నేను ఒక్కసారి మాత్రమే చెడుగా భావించాను. ఆపై నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అలాగే మున్నా భాయ్ MBBS కోసం సైన్ అప్ చేసాను... కానీ అది కూడా కోల్పోయాను. మణి (రత్నం) సర్‌తో కన్నతిల్ ముత్తమిట్టల్ కూడా కోల్పోయాను అని తెలిపింది.

రాజ్‌కుమార్ హిరాణీతో మున్నాభాయ్ అవ‌కాశం కోల్పోవ‌డానికి కార‌ణం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తన తప్పిదాల వల్ల భూమిక‌కు అవ‌కాశం రాలేద‌ని హిరాణీ అన్నార‌ట‌. వినోద పరిశ్రమలో ఇలాంటి నిర్ణయాలు సర్వసాధారణమని, నటి లేదా న‌టుడి ప‌రిధిలో నియంత్రణకు మించిన కొన్ని కారణాల వల్ల తరచుగా ఇలా జ‌రుగుతుంద‌ని భ‌న్సాలీ వివ‌రించార‌ట‌. అయితే భూమిక కోల్పోయిన జ‌బ్ వియ్ మెట్, మున్నాభాయ్ ఎంబిబిఎస్ ఇండ‌స్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిల‌వ‌డ‌మే గాక అందులో న‌టించిన స్టార్ల జీవితాల‌నే మార్చేసాయి. అంత పెద్ద నేమ్ ఫేం వ‌చ్చింది. కానీ ఆ స‌మ‌యంలో భూమిక వాటిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. లైఫ్ లో గేమ్ ఛేంజ‌ర్ ఆఫ‌ర్లు ఇవి.

2008లో భూమిక పంజాబీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. గురుదాస్ మాన్ సరసన 'యారియాన్'లో నటించింది. కొంతకాలం తర్వాత మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. మోహన్‌లాల్‌తో కలిసి 'భ్రమరం' చిత్రంతో అరంగేట్రం చేసింది. తెలుగులో సుమంత్ స‌ర‌స‌న యువ‌కుడు అనే చిత్రంతో తెరంగేట్రం చేసిన భూమిక ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి పెద్ద స్టార్ స‌ర‌స‌న ఖుషి చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఇండ‌స్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. వ‌ర్త‌మానంలోకి వ‌స్తే.. 2023 చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'తో భూమిక కంబ్యాక్ అయింది. ఇందులో భూమిక‌ సహాయక పాత్రలో నటించింది. 'తేరే నామ్'లో స‌ల్మాన్ తో న‌టించిన భూమిక చాలా కాలానికి తిరిగి స‌ల్మాన్‌ తో కిసీ కా భాయ్ లో అవ‌కాశం అందుకుంది.

Tags:    

Similar News