సినిమాను బలవంతంగా చంపేస్తున్నారు: బాబీ
ఆ సినిమా మంచి హిట్ అవడంతో బాబీకి తర్వాత డైరెక్టర్ గా వెనుకడుగేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
స్క్రీన్ రైటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బాబీ కొల్లి అలియాస్ కె.ఎస్ రవీంద్ర తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన పవర్ సినిమాతో డైరెక్టర్ గా మారాడు. ఆ సినిమా మంచి హిట్ అవడంతో బాబీకి తర్వాత డైరెక్టర్ గా వెనుకడుగేయాల్సిన అవసరం లేకుండా పోయింది. బాబీ దర్శకుడిగా మారాక 6 సినిమాలు చేశాడు.
ప్రతీ సినిమాతో తనదైన మార్క్ వేసుకున్న బాబీ రెండేళ్ల కిందట చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు రీసెంట్ గా సంక్రాంతికి బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాబీ మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు బాబీ.
2003లో ఇండస్ట్రీలోకి వచ్చిన బాబీ, 2012 వరకు రైటర్ గా వర్క్ చేసి ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. బలుపు సినిమాకు వర్క్ చేసే వరకు బాబీ ఎవరో కూడా ప్రపంచానికి తెలీదని, ఆ సినిమా తర్వాతే బాబీ అంటే ఎవరో అందరికీ తెలిసిందని రీసెంట్ గా బాబీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. తాను చేసిన ప్రతీ సినిమా నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటానని చెప్పాడు. డాకు మహారాజ్ లో బాలయ్యను కొత్తగా ప్రెజెంట్ చేయాలని మొదటి నుంచి అనుకున్నానని, ఆ ఆలోచనతోనే ప్రతీ సీన్ ను కొత్తగా రాశానని, సినిమా రిలీజయ్యాక ఆడియన్స్ అభినందిస్తుంటే ఎంతో సంతోషమేసిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు బాబీ.
ఈ సందర్భంగా బాబీ నెగిటివ్ రివ్యూల గురించి మాట్లాడాడు. ఒకప్పుడు నెగిటివ్ రివ్యూలంటే సరదాగా ఉండేవని, కానీ ఇప్పుడలా లేదన్నాడు. సినిమా ఫస్ట్ షో పడిన దగ్గరనుంచే నెగిటివ్ రివ్యూల్ని కావాలని ప్రచారం చేస్తున్నారని, అయినా ఏ ఒక్కరి అభిప్రాయం ఒకేలా ఉండదు కాబట్టి మన అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదని బాబీ అన్నాడు.
ఈ రోజుల్లో సినిమాను కావాలని టార్గెట్ చేసి బలవంతంగా చంపే ప్రయత్నాలు చేస్తున్నారని, బాహుబలి లాంటి గొప్ప మూవీ వచ్చినప్పుడే అందులో కథేమీ లేదని రాజమౌళిని ట్రోల్ చేశారు. కానీ బాహుబలి రికార్డులను సృష్టించి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. రాజమౌళి అంతటి పెద్ద డైరెక్టర్‌నే ట్రోల్ చేసినప్పుడు ఇక నేనెంత అనిపిస్తుందని, వాల్తేరు వీరయ్య సినిమా టైమ్ లో కూడా ఆ సినిమా బాలేదని తక్కువ రేటింగ్స్ ఇచ్చారు. కానీ చివరకు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకు కూడా మొదట్లో అలాంటి టాక్‌నే స్ప్రెడ్ చేశారు కానీ ఈ సినిమా కూడా అందరినీ మెప్పించి హిట్ గా నిలిచిందని బాబీ తెలిపాడు.