పరిచయం లేని సౌత్ యాక్టర్ల సినిమాలకు వందల కోట్లు వస్తున్నాయి
ఒకప్పటిలా బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు సక్సెస్ అవడం లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది.;
ఒకప్పటిలా బాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలు సక్సెస్ అవడం లేదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేటు బాగా తగ్గిపోయింది. ఒకప్పుడున్నంత క్రేజ్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు లేదు. ఎప్పుడూ ఒకే రకమైన కథలు, అదే రొటీన్ యాక్షన్ తో విసిగిపోయిన నార్త్ ఆడియన్స్ కు సౌత్ సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి.
నార్త్ ఆడియన్స్ పల్స్ ను సరిగ్గా పట్టుకున్న సౌత్ సినిమాలు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మంచి కలెక్షన్లు అందుకుని సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రతీ సౌత్ మూవీ నార్త్ ను టార్గెట్ చేస్తోంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా జరిగిన ఒక ఫిల్మ్ ఫెస్టివల్ లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఆమిర్ ఖాన్ తో పాటూ సీనియర్ రైటర్ జావేద్ అక్తర్ పాల్గొని ఈ విషయమై చర్చించారు.
బాలీవుడ్ నుంచి ప్రతీ ఏటా ఎన్నో కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ హిందీ ఆడియన్స్ ను ఆ సినిమాలు ఆకట్టుకోలేకపోతున్నాయని, ముక్కూ ముఖం తెలియని సౌత్ హీరోల సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని, సౌత్ డబ్బింగ్ సినిమాలను కూడా బాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తున్నారని, అసలు పరిచయం కూడా లేని నటుల సినిమాలకు రూ.600 నుంచి రూ.700 కోట్ల వసూళ్లు వస్తున్నాయని, హిందీ చిత్ర పరిశ్రమ ఇంత వెనుక పడటానికి కారణమేంటని ఆమిర్ ను అడుగుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు జావేద్ అక్తర్.
జావేద్ ప్రశ్నకు ఆమిర్ సమాధానం చెప్తూ, ప్రాంతీయ నేపథ్యం గురించి మాట్లాడిన అవసరం ఇప్పుడు లేదని, సౌత్, నార్త్ సినిమాలనేవి అసలు సమస్యే కాదని ఆమిర్ తెలిపారు. బాలీవుడ్ ఫాలో అవుతున్న బిజినెస్ మోడల్ వల్లే తమ సినిమాలకు మంచి గుర్తింపు దక్కడం లేదని, రిలీజ్ కు ముందు సినిమాను చూడమని అడుగుతాం. ఒకవేళ ఆడియన్స్ థియేటర్లకు రాకపోతే 8 వారాల తర్వాతే మనమే దాన్ని ఓటీటీలోకి తీసుకెళ్లి రిలీజ్ చేస్తున్నాం. ఒకప్పుడు ఈ ఆప్షన్ లేదు. కాబట్టి సినిమాలు బాగా ఆడాయి. కానీ ఇప్పుడు అందరికీ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిన పనేముంటుందని అడిగిన ఆమిర్, మన బిజినెస్ మోడల్ తో మనమే సినిమాలను చంపుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.