1000 ఎకరాల్లో భారీ ఫిలింసిటీ..అగ్ర నిర్మాతకు కాంట్రాక్ట్!
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ రామోజీ ఫిలింసిటీ తరహాలో భారీ ఫిలింసిటీని నిర్మించనున్నారా? అంటే అవుననే వార్త వెలువడింది
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ రామోజీ ఫిలింసిటీ తరహాలో భారీ ఫిలింసిటీని నిర్మించనున్నారా? అంటే అవుననే వార్త వెలువడింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ప్రముఖ నిర్మాత కేసి బొకాడియా కూడా కాంట్రాక్ట్ కోసం రేసులో నిలవగా అవకాశం బోనీని వరించింది. నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి 1000 ఎకరాల (మొదటి దశలో 230 ఎకరాలు) భూమిలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో బోనీకపూర్ అతడి భాగస్వాములు భారీ ఫిల్మ్ సిటీని నిర్మించనున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ భూటానీ గ్రూప్ మద్దతు ఉన్న బేవ్యూ ప్రాజెక్ట్స్ తో కలిసి నిర్మాత బోనీకపూర్ భారీ ఫిలింసిటీ నిర్మాణానికి బిడ్ ని గెలుచుకున్నారని జాతీయ మీడియా నివేదించింది. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఫిలింసిటీని అభివృద్ధి చేయడానికి బోనీ అతడి భాగస్వాములు కాంట్రాక్ట్‌ను పొందినట్లు పిటిఐ మంగళవారం కథనం ప్రచురించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YEIDA) మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రాజెక్ట్ కోసం ఆర్థిక బిడ్‌ను ప్రారంభించింది. M/s బేవ్యూ ప్రాజెక్ట్స్ LLP (బోనీ కపూర్ - భూటానీ గ్రూప్) ఫిల్మ్ సిటీ కోసం అత్యధిక మొత్తంతో బిడ్ సమర్పించిన సంస్థగా యమునా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాంతంలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేస్తుంది అని YEIDA విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన తెలిపింది. ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఏదైనా భూమిని కేటాయించే ముందు రాయితీదారుని ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని తెలుస్తోంది.
బోనీ బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్.ఎల్.పితో పోటీపడిన వాటిలో సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (T-సిరీస్), సూపర్‌సోనిక్ టెక్నోబిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (సినిమా నటుడు అక్షయ్ కుమార్, మడాక్ ఫిల్మ్స్ సహా ఇతరుల మద్దతు) , 4 లయన్స్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (సినిమా నిర్మాత KC బొకాడియా, ఇతరుల మద్దతుతో) పోటీ పడ్డాయి. చివరికి బోనీ అండగా నిలిచిన ఎల్.ఎల్.పికే ఫిలింసిటీ కాంట్రాక్ట్ దక్కింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధి కమిటీ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ముందు నాలుగు సంస్థలు తమ అభివృద్ధి నమూనా .. సంబంధిత ప్రాజెక్టుల ఇతర వివరాలను గత శనివారం నాడు అందించాయి.
నోయిడా సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వెంబడి 1000 ఎకరాల (మొదటి దశలో 230 ఎకరాలు) భూమిలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఫిల్మ్ సిటీని నిర్మించనున్నారు. గత సంవత్సరం సెప్టెంబరు 30న యెయిడా ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఉన్న ఫిల్మ్ మేకర్స్ నుండి బిడ్‌లను ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్‌ను ఓపెన్ చేసింది. సెక్టార్ 21లో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేయాల్సి ఉంటుందని ప్రకటించింది. బిడ్‌లను సమర్పించడానికి చివరి తేదీగా 5 జనవరి 2024ని నిర్ణయించింది. ఫేజ్ 1లో, 230 ఎకరాల స్థలంలో ఫిల్మ్ సిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే బాధ్యతను ఖరారు చేసిన కంపెనీకి అప్పగించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సెక్టార్ 21లో యెయిడా మొత్తం 1000 ఎకరాల భూమిని కేటాయించింది.
డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ప్రకారం.. డెవలపర్ సైట్‌లో డెవలప్‌మెంట్ ప్రారంభించే ముందు సెక్యూరిటీ డబ్బుగా రూ.144 కోట్లు చెల్లించాలి. కీలకమైన ఈ ప్రాజెక్టు పురోగతికి సంబంధించిన డీపీఆర్‌ను యూపీ ప్రధాన కార్యదర్శి డీఎస్ మిశ్రా నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆమోదించింది. జెవార్ ఎయిర్‌పోర్ట్ ప్రదేశానికి సమీపంలో ఉన్న సెక్టార్ 21లో 1000 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి డెవలపర్‌కు 90 ఏళ్ల సమయం ఉంటుందని DPR తెలిపింది.