అమితాబ్ అన్న ఆ మాట విని షాకయ్యాను: చిరంజీవి
హైదరాబాద్ లో జరగిన ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి పురస్కారం అందుకున్నారు
``ఏయన్నార్ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. భారతదేశంలోనే బిగ్గెస్ట్ స్టార్.. మై గురు, మై మెంటర్ మై ఇన్స్పిరేషన్ అమితాబ్ జీ చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది`` అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. హైదరాబాద్ లో జరగిన ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రదానోత్సవం వేడుకలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా మెగాస్టార్ చిరంజీవి పురస్కారం అందుకున్నారు. దిగ్గజాల నడుమ ఈవెంట్ వైభవంగా సాగింది.
పద్మ విభూషణ్, ఏయన్నార్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. బిగ్ స్టార్ ఆఫ్ ఇండియా అమితాబచ్చన్ గారి చేతుల మీదుగా ఈ అవార్డుని తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు జరిగిన సన్మాన కార్యక్రమంలో అమితాబచ్చన్ గారు `చిరంజీవి కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా` అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజానికి ఆ మాట విని షేక్ అయ్యాను. ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐయామ్ ఓవర్ వెల్మ డ్. ఆ రోజు నేను ఆయనకి థాంక్స్ చెప్పానో లేదో కూడా తెలీదు. ఒక డిఫరెంట్ ప్లేన్ లో ఉన్నాను. బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అమితాబచ్చన్ నుంచి ఆ మాటలు రావడం ఎంతో ఆనందం. థాంక్యూ సో మచ్ బచ్చన్ జి. మీ మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. అమితా బచ్చన్ తో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో విలువైనది. నేను హిందీలో ప్రతిబంద్ సినిమా చేసినప్పుడు కేవలం అమితాబచ్చన్ గారికి మొదటిగా చూపించాను. ఆయన కోసం స్పెషల్ గా ప్రొజెక్షన్ వేసాం. మా ఇద్దరమే ఆ సినిమా చూశాం. సినిమా అంత చూసి ఆయన వెరీ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్. వెరీ పర్పస్ ఫుల్ ఫిలిం. వెరీ గుడ్ జాబ్. ఆల్ ద వెరీ బెస్ట్`` అని చెప్పారు. ఆ మాటలు నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయి. మా ఇంట్లో జరిగే ప్రతి శుభకార్యానికి ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమితాబచ్చన్ గారు సైరా సినిమాలో ఒక కామియో రోల్ చేశారు. ఆయనకి ఎలా అడగాలో తెలియక ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసి వెంటనే ఆ క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సినిమా అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ గురించి అడిగాను. ``నీపై ఉన్న ప్రేమతో చేశాను. యు ఆర్ మై ఫ్రెండ్. ఫార్మాలిటీస్ గురించి మాట్లాడొద్దు`` అని చెప్పారు. క్షణం మర్చిపోలేను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడ్ని కోరుకుంటున్నాను. లాంగ్ లీవ్ అమితాబ్ జి. థాంక్యూ సో మచ్`` అని అన్నారు.
తెలుగులో ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని ఓ నానుడి ఉంది. నా విషయంలో రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట గెలిచాను ఏమో అనిపిస్తోంది. నటుడిగా నేను ఎదుగుతున్న సమయంలో బయట ప్రేక్షకులు, సన్నిహితుల నుంచి ప్రశంసలు వచ్చేవి. అయితే ఇంటికి వెళ్లినప్పుడు మా నాన్న సినిమాలు చూసి పొగుడుతారేమో అని అనుకునేవాణ్ని. మా నాన్నకు నటన అంటే చాలా ఇష్టం. అలాంటి మా నాన్న నన్ను ఎందుకు పొగడరు అనిపించేది. ఓ రోజు ఇంటికి వెళ్లినప్పుడు నా కవర్ పేజీలతో కొన్ని పుస్తకాలు చూస్తున్నారు. నేను వెళ్లేసరికి తీసి పక్కన పడేశారు. ఫొటోలు బాగున్నాయిరా అని ఓ మాట అంటారేమో అని అనుకున్నాను. కానీ ఆయన అలా అనలేదు. లోపలకు అమ్మ దగ్గరకు వెళ్లి.. ‘ఏంటమ్మా నాన్న ఎప్పుడూ నా గురించి ఓ మాట అనరు, బాగుందని కూడా చెప్పరు’ అని అడిగాను. బయట రచ్చ ఎంత గెలిచినా సరే.. ఇంట గెలవడం లేదు అనిపిస్తోంది అని అన్నాను. దానికి అమ్మ ‘లేదురా నాన్న చాలా పొగుడుతారు. ఏం చేశాడు నా కొడుకు, అదరగొట్టేశాడు’ అని అంటుంటారు అని చెప్పింది. మరి నా దగ్గర ఆ మాటలు అనొచ్చు కదా అని అమ్మను అంటే ‘బిడ్డల్ని తల్లిదండ్రుల్ని పొగడకూడదు. అది వారికి ఆయుక్షీణం’’ అని అమ్మ చెప్పింది. సినిమా పరిశ్రమలో నేను తొలుత రచ్చ గెలిచాను. నా ఇల్లు అనుకునే పరిశ్రమలో నాకు ఆ అవకాశం టాలీవుడ్ వజ్రోత్సవాల సమయంలో వచ్చింది. లెజండరీ పురస్కారం ప్రదానం చేశారు. ఆ సమయంలో చాలా ఆనందమేసి ధన్యుణ్ని అనుకున్నా. కానీ ఆ రోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో కొందరు హర్షించని ఆ సమయంలో ఆ పురస్కారాన్ని తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు ఆ అవార్డుని ఓ క్యాప్సుల్ బాక్స్‌లో పడేసి నాకు అర్హత ఎప్పుడు వస్తుందో అప్పుడు తీసుకుంటాను అని చెప్పాను. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ది గ్రేట్ ఏఎన్నార్ అవార్డును ది గ్రేట్ అమితాబ్ బచ్చన్ గారి చేతులు మీదగా అందుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తోంది.. ‘నేను ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను’ అని. అందుకే ఈ పురస్కారం గురించి చెప్పడానికి నాగార్జున, వెంకట్ ఇంటికి వచ్చినప్పుడు నేను చాలా ఆనందించాను. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌లో స్థానం.. ఇలాంటివి ఎన్ని వచ్చినా ఈ అవార్డు విషయంలో నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇస్తుండటం నాకు గొప్ప విషయంగా అనిపించింది. అందుకే నాగార్జునతో ఇది నాకు అన్ని పురస్కారాలకు మించిన ప్రత్యేకమైన అవార్డు అని చెప్పా. ఇదే మాట స్టేజీ మీద చెప్పాలి అనుకున్నాను. ఇప్పుడు చెప్పాను.
ఏఎన్నార్ గారు అంటే నాకు అమితమైన ప్రేమ. ఆ తర్వాత ఆ ప్రేమ నాకు నాగర్జున మీద కలిగింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్ ఆరోగ్య సూత్రాలు పాటించడంలో ఎక్సర్సైజ్ చేయడంలో ఎప్పుడూ యంగ్ గా ఉండడానికి ఆయన తీసుకునే శ్రద్ధ శక్తులు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. వాటిని అలవర్చుకుంటాను ఆచరిస్తుంటాను. నాకు నాగార్జున ఒక స్నేహితుడు, బ్రదరే కాదు.. నాకు ఆరోగ్య సూత్రాలు తెలిపే డాక్టర్ కూడాను. ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. అఖిల్ నాకు మరో బిడ్డ లాగా పెదనాన్న అని పిలుస్తున్నప్పుడు నాకెంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళ పిల్లలందరూ మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుడిని. నాగ్ లాంటి స్నేహితుడిని నేను జీవితాంతం పదిలంగా దాచుకుంటాను... అని అన్నారు.
దేవానంద్, లతా మంగేష్కర్, అమితాబచ్చన్ గారు ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులకి వచ్చిన ఈ ఏఎన్ఆర్ ప్రతిష్టాత్మకమైన అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అవార్డు రావడం నా సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని భావిస్తున్నాను. నాగేశ్వరరావు గారి ఆశీస్సులు మనందరిపై నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఈ క్షణాన్ని జీవితాంతం నా మనసులో పదిలపరుచుకుంటాను. ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి ధన్యవాదాలు. ఈ సందర్భంగా టి సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జైహింద్' అన్నారు.