ఇంతకీ మెగాస్టార్ నెక్స్ట్ మూవీ ఎవరితో?
2022 ఏప్రిల్ - 2023 ఆగస్టు మధ్య కాలంలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి.
2022 ఏప్రిల్ - 2023 ఆగస్టు మధ్య కాలంలో నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆ సమయంలో ఒకే నెలలో నాలుగు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొన్న ఏకైక స్టార్ హీరోగా రికార్డ్ క్రియేట్ చేశారు కూడా. యంగ్ హీరోలే ఏడాదికో సినిమా చేస్తుంటే.. ఆరు పదులు వయస్సులోనూ చిరు స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే 'భోళా శంకర్' సినిమా డిజాస్టర్ గా మారిన తర్వాత చిరంజీవి కాస్త స్పీడ్ తగ్గించారు. దాదాపు ఏడాది కాలంగా ''విశ్వంభర'' చిత్రానికే పరిమితం అయ్యారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు.
బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా తెరకెక్కుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ మధ్యలో 'గేమ్ ఛేంజర్' రాకతో ప్లాన్స్ అన్నీ ఛేంజ్ అయ్యాయి. సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. చాలా సమయం దొరకడంతో, చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇటీవల కాస్త అనారోగ్యానికి గురైన చిరు, రెస్ట్ తీసుకొని దాన్నుంచి పూర్తిగా కోలుకోవాలని భావిస్తున్నారు. అయితే ఈ గ్యాప్ లో తన రాబోయే సినిమా దర్శక రచయితలతో స్క్రిప్ట్ మీద చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ దర్శక రచయిత బీవీఎస్ రవి ఇప్పటికే చిరంజీవికి ఓ స్టోరీ నేరేట్ చేసారు. సామాజిక అంశాలతో కూడిన ఈ కథకి మెగాస్టార్ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దీనికి 'గాడ్ ఫాదర్' ఫేమ్ మోహన్ రాజాని డైరెక్టర్ గా అనుకున్నారు. ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ మీద వర్క్ చేసారు. చిరు సూచనల మేరకు ఛేంజెస్ చేసి.. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఓ సోషల్ డ్రామా కథను సిద్ధం చేసారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా స్క్రీన్ రైటర్ బీవీఎస్ రవి స్పష్టం చేసారు.
చిరంజీవితో సోషల్ టాపిక్ మీద సినిమా చేయబోతున్నట్లు రవి తెలిపారు. 'ఠాగూర్' 'ఇంద్ర' లాంటి చిత్రాల తరహాలోనే ఉంటుందని హింట్ కూడా ఇచ్చారు. బాస్ పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ, ‘విశ్వంభర’ తరవాత తమ సినిమానే ఉంటుందని ప్రకటించేసారు. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. బీవీఎస్ రవి స్టోరీని చిరు ఓకే చేసినప్పటికీ, దీన్నే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సెట్స్ మీదకు తీసుకెళ్లాలనే విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ఎందుకంటే చిరంజీవి తదుపరి సినిమా కోసం చిరంజీవి డైరెక్టర్ హరీష్ శంకర్‌తో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అలానే మరో ఇద్దరు యువ దర్శకులతోనూ చిరు టచ్‌లో ఉన్నారట. ప్రస్తుతం వీరంతా స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు. హరీష్ స్క్రిప్ట్ విన్న తర్వాత మెగాస్టార్ తన నెక్స్ట్ మూవీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ‘విశ్వంభర’ విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్స్ గురించి ఆలోచిస్తారనే మాట కూడా వినిపిస్తోంది.
స్టోరీలు ఓకే చేసి పెడుతున్నారు కానీ, ప్రస్తుతానికైతే చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. బీవీఎస్ రవి - మోహన్ రాజా సినిమాని ముందుగా సెట్స్ మీదకు తీసుకెళ్తారా? లేదా స్క్రిప్ట్ నచ్చి హరీశ్ శంకర్ ను ముందుకు తీసుకొస్తారా? అనేది చూడాలి. ఏ సినిమా ఫిక్స్ అయినా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మెగా డాటర్ సుష్మిత కొణిదెల తన హోమ్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నారని టాక్ నడుస్తోంది. మరి త్వరలోనే చిరు నెక్స్ట్ సినిమా ఏది? ఏ డైరెక్టర్ తో చేస్తారు? అనే విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.