చిరు కోసం ఆయన బరిలోకి దిగాల్సిందే..

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2023-08-13 15:30 GMT

చిరంజీవి - అల్లు అరవింద్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ రెండు కుటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాయని ఎన్ని సార్లు ప్రచారలు జరిగినా ఏదో ఒక సందర్భంలో తమ సమాధానాలతో, చర్యలతో వాటికి చెక్ పెడుతూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే చిరంజీవి అర్జునుడు అయితే.. అల్లు అరవింద్ కృష్ణుడు అని కూడా అంటుంటారు.

అయితే ఇప్పుడు చిరంజీవికి అల్లుఅరవింద్ అండ, అనుభవం అవసరమన్న వాదనలు ఇంకాస్త ఎక్కువగా వినిపిస్తున్నాయి. కానీ అది వ్యక్తిగత జీవితంలో కాదు. సినిమాల విషయంలో అని అంటున్నారు. రీఎంట్రీలో చిరు చేసే సినిమాలు భారీ స్థాయలో ఆకట్టుకోలేకపోతున్నాయి. వాల్తేరు వీరయ్య ఒక్కటే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. తాజాగా వచ్చిన భోళాశంకర్ కూడా భారీ డిజాస్టర్ అందుకుంది.

దీంతో చిరు.. అల్లు అరవింద్ తో కలిసి పనిచేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిజానికి వీరిద్దరు కలిసి ఓ సినిమా చేసి ఏళ్ళు గడిచిపోయాయి. అప్పుడెప్పుడో 2005లో విడుదలైన అందరివాడు సినిమా ఆఖరిది. ఆ తర్వాత కొంత కాలానికి చిరు పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. ఇక అరవింద్ కూడా మిగతా వాళ్లతో సినిమాలు చేస్తూ బిజీ అవ్వడం, అలాగే చిరు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన వ్యవహారాలు చూసుకోవడం జరిగింది.

ఇక చిరు రీఎంట్రీలో ఆయన సినిమాలకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ చూసుకోవడం ప్రారంభించారు. కొణిదెల బ్యానర్ ను స్థాపించి దానిపై ఖైదీ నెంబర్ 150, సైరా చిత్రాలు నిర్మించారు. అలాగే ఆచార్య చిత్రానికి భాగస్వామిగా ఉన్నారు. అలాగే చిరు కూడా సొంత బ్యానర్ తో పాటు బయట నిర్మాణ సంస్థల్లోనూ చేస్తున్నారు.

అయితే చిరు సినిమాల వ్యవహారంలో అరవింద్ హ్కాండ్ ఎక్కడా లేదు. ఇద్దరి మధ్య చాలా ఏళ్ల గ్యాప్ వచ్చేసింది. ఎప్పుడూ కూడా కలిసి ఏదైనా సినిమా చేసే దిశగా ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే అల్లు అరవింద్.. కథలను జడ్జ్ చేయడంలో, అందులోనూ చిరుకు ఎలాంటివి సెట్ అవుతాయో పసిగట్టగలరని అభిప్రాయపడుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, మాస్టర్.. ఇలా ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయని గుర్తు చేస్తున్నారు.

పైగా రీసెంట్ గా ఈ మధ్యే చిరుపై తన అభిమానాన్ని కూడా చాటుకున్నారు అల్లు అరవింద్. ఓ స్టేజ్ పై మాట్లాడుతూ.. చిరంజీవి చేసే సేవా కార్యక్రమాల గురించి ఒకరు నీచంగా మాట్లాడితే.. పన్నెండేళ్లు పోరాటం చేసి మరీ జైలుకు పంపించానంటూ జీవిత రాజశేఖర్ పై పరోక్షంగా కామెంట్లు కూడా చేశారు. అభిమానులు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే.. తాను చేస్తూ పెరిగాను అంటూ గొప్పగా మాట్లాడారు. అందుకే ఇప్పుడు అందరూ చిరుకు.. అల్లు అరవింద్ అండ, అనుభవం అవసరమని అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది జరగలాంటే కాస్త సమయం పట్టొచ్చు. ఎందుకంటే చిరు ఇప్పటికే ఇతర నిర్మాణ సంస్థలతో మరో రెండు చిత్రాలు ఒప్పుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News