2024 లోనైనా మొదలవుతుందా దీపిక?
ఇంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన దీపిక తన సొంత బ్యానర్ ప్రకటించిన సినిమా ని పట్టాలెక్కించడానికి మాత్రం నానా అగచాట్లు పడుతున్నట్లే కనిపిస్తుంది.
బాలీవుడ్ లో దీపికా పదుకొణే స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అగ్ర హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగుతుంది. హీరోల సరసన నటిస్తూనే సోలోగానూ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నటి. నటిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న నటి. అధిక పారితోషికం తీసుకునే హీరోయన్లలో దీపిక టాప్ లో ఉంది? అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక బ్రాండింగ్స్ ని ఎండార్స్ చేస్తూ అక్కడా భారీగానే సంపాదిస్తుంది.
ఇంత గొప్ప ట్రాక్ రికార్డు కలిగిన దీపిక తన సొంత బ్యానర్ ప్రకటించిన సినిమా ని పట్టాలెక్కించడానికి మాత్రం నానా అగచాట్లు పడుతున్నట్లే కనిపిస్తుంది. రెండేళ్ల క్రితం హాలీవుడ్ చిత్ర ది ఇంటెర్న్ ని హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాలీవుడ్ లో మంచి విజయం సాధించడంతో అదే టైటిల్ తో హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నడుం బిగించింది. ఈ ప్రాజెక్ట్ కి ఎవరైతే న్యాయం చేస్తారని భావించి చాలా మంది దర్శకుల్ని పరిశీలించి చివరిగా అమిత్ శర్మని ఫైనల్ చేసింది.
హిందీ ప్రేక్షకుల అభిరుచుకి తగ్గట్టు కథను మార్చడం జరిగింది. కానీ ఇంతవరకూ ఈ సినిమాని ప్రారం భించింది లేదు. అందుకు గల కారణాలు ఏంటి ? అన్నది తెలియదు గానీ ప్రకటించిన తర్వాత దీపిక పదుకొణే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత అందులో నటించే నటీనటులు ఎవరు? టెక్నికల్ టీమ్ ఏంటి? అన్నది ఏదీ పట్టించుకోలేదు. రెండేళ్లు గడవడంతో మీడియా సైతం ఈ విషయాన్ని మర్చిపోయింది.
దీనిపై ఎలాంటి టాపిక్ కూడా బాలీవుడ్ సహా మీడియాలోనూ చర్చకు రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని 2024 జనవరిలో ప్రారంభించే అవకాశాలున్నట్లు ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులో నిజం ఎంత అన్నది తెలియదు గానీ జాతీయ మీడియాలో ఈ వార్త బయటకు రావడం ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పటికైనా దీపికా ది ఇంటెర్న్ గురించి ఏ వివరాలైనా చెబుతుందా? ఎప్పటిలాగే మౌనం వహిస్తుందా? అన్నది చూడాలి. 2024 లో మొదలైతే మోక్షం కలిగినట్లే.