స్వామి వారి సన్నిధిలో దేవరకొండ బ్రదర్స్ ఎమోషనల్!
యాదగిరి గుట్ట శిల్పకళా నైపుణ్యం అద్భుతమని సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రశంసించారు.
యాదగిరి గుట్ట శిల్పకళా నైపుణ్యం అద్భుతమని సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రశంసించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని సినీ నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ సోదరులు సందర్భించారు. వారి కుటుంబ సభ్యులు, ఖుషీ చిత్ర బృందం ఆదివారం దేవాదిదేవుని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో గీత వారికి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడుతూ పైవిధగా స్పందించారు.
కాకతీయ, పల్లవ, చోళుల కళారూపాలతో యాదాద్రి ఆలయం అద్భుతంగా ఉందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని నిర్మించిందని తెలిపారు. గతంలో కంటే దేవాలయం ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ఆలయానికి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిందన్నారు. ఈ సంవత్సరం మా కుటుంబానికి చాలా బాగుంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ సమయంలో దేవాలయం వెలుపల భక్తులు, అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
దేవరకొండతో ప్రభుత్వ విప్ భేటీ..
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన సినీనటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండలను ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కలిశారు. ప్రభుత్వ విప్ తో కొన్ని నిమిషాల పాటు దేవరకొండ బ్రదర్స్ ముచ్చట్లాడారు. ఈ సందర్భంగా వారికి విప్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖుషి దర్శకులు, నిర్మాతలు, ఆలయ ఈవో ఎన్.గీత, ఆలయ పర్యవేక్షకులు రఘు, రాజన్‌బాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
కలిసొచ్చిన వేళ ఇది..
బేబి సినిమాతో ఆనంద్ దేవరకొండ, ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. బేబి చిత్రం 90కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించగా.. ఖుషి చిత్రం విడుదలైన తొలి మూడు రోజుల్లోనే 40కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది తమకు కలిసి వచ్చిన సంవత్సరం అంటూ దేవరకొండ బ్రదర్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేయడం ఆసక్తికరం.