'పుష్ప 2'.. సుకుమార్ సరైన నిర్ణయమే తీసుకున్నాడా?
దర్శకుడు తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి.
సుకుమార్ సినిమాలలో 'ఐటెం సాంగ్స్' ఎంతో ప్రత్యేకంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. దర్శకుడు తీసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ''పుష్ప 2: ది రూల్'' మూవీలోని ఐటెమ్ సాంగ్‌పై అందరి దృష్టి పడింది. అందులోనూ 'పుష్ప: ది రైజ్'లో సమంత రూత్ ప్రభు చేసిన 'ఊ అంటావా మావా' పాట పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించడంతో.. పార్ట్-2లో సుక్కూ ఎలాంటి ఐటెం నంబర్ పెట్టారో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
''పుష్ప 2'' మూవీలో 'కిస్సిక్' అంటూ సాగే స్పెషల్ సాంగ్ ఉంది. ఇందులో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల ఐటెం గర్ల్ గా ఆడిపాడింది. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన సెట్ లో అల్లు అర్జున్ - శ్రీలీల మీద ఈ పాటను చిత్రీకరించారు. ఇద్దరూ పోటాపోటీగా డ్యాన్సులు ఇరగదీశారని, దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజికల్ డిలైట్గా ఉండబోతోందని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. కచ్చితంగా సుకుమార్ గత సినిమాల్లో ఐటెం సాంగ్స్ మాదిరిగానే, మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుందని చెబుతున్నారు.
నిజానికి 'పుష్ప 2' ఐటెం సాంగ్ గురించి, దాంట్లో కనిపించే ఐటెం బాంబ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ముందుగా ఈ పాట కోసం యంగ్ బ్యూటీ శ్రీలీల ను అనుకున్నారు. కానీ అప్పుడు అమ్మడు క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఫుల్ ఫార్మ్ లో ఉండటంతో, ఐటెం సాంగ్ చేయడానికి ఆసక్తి కనబరచలేదనే టాక్ వచ్చింది. ఆ తర్వాత వరుస ప్లాప్స్ పడటంతో శ్రీలీల పేరును మేకర్స్ పక్కన పెట్టారట. పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, నార్త్ మార్కెట్ కు ఉపయోగపడుతుందని బాలీవుడ్ బ్యూటీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో శ్రద్దా కపూర్ ను సంప్రదించారు.
'స్త్రీ 2' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో, స్పెషల్ సాంగ్ కోసం శ్రద్ధా కపూర్ నే తీసుకోవాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారట. ఇందుకుగాను ఆమె దాదాపు 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒక పాటకు అది చాలా పెద్ద అమౌంట్ అయినా.. హిందీలో మరింత హైప్ వస్తుందని భావించి ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారు. టైం కూడా ఎక్కువ లేకపోవడంతో శ్రద్ధాతోనే వెళ్లాలని అనుకున్నారట. కానీ సుకుమార్ మాత్రం అంత పారితోషికం ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలనే నిర్ణయానికి అడ్డు చెప్పారట.
ఇప్పటికే 'పుష్ప 2' సినిమాకి కావాల్సినంత హైప్ ఉంది. సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇటీవల కాలంలో ఏ సినిమాకి ఈ రేంజ్ లో ప్రీరిలీజ్ బజ్ లేదనే చెప్పాలి. అలాంటిది ఇప్పుడు శ్రద్దాకపూర్ తో ఐటెం సాంగ్ చేయించడం వల్ల కొత్తగా వచ్చేది ఏమీ లేదు. 8 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోవడం వల్ల బడ్జెట్ పెరుగుతుందే తప్ప, అదనపు ప్రయోజనం పెద్దగా లేదు. ఇవన్నీ ఆలోచించే సుకుమార్ స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలనే తీసుకోవాలని డిసైడ్ అయ్యారట. దీంతో ఈ ఆఫర్ చివరకు మళ్ళీ శ్రీలీల వద్దకే చేరింది.
శ్రద్దాకపూర్ కంటే శ్రీలీల మంచి డ్యాన్సర్. ఆమె గ్లామర్, డ్యాన్స్ లతోనే పాపులారిటీ సంపాదించుకుంది. ఆల్రెడీ 'కుర్చీ మడతపెట్టి' లాంటి సాంగ్ లో ఇరగదీసింది. అల్లు అర్జున్ కి పోటీగా స్టెప్పులు వేసి మెప్పించగల సత్తా యంగ్ బ్యూటీకి ఉంది. దీనికి తోడు శ్రద్దాతో పోల్చుకుంటే ఆమె రెమ్యునరేషన్ కూడా తక్కువ. 'కిస్సిక్' పాట కోసం శ్రీలీలకు కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ఏవిధంగా చూసుకున్నా స్పెషల్ సాంగ్ విషయంలో సుకుమార్ సరైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి.
'పుష్ప 2: ది రూల్' సినిమాలో ఐకాన్ స్టార్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్, జగపతిబాబు, రావు రమేష్, డాలీ ధనుంజయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.