సక్సెస్ ను మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్న అగ్ర నిర్మాత..!?
లేటెస్టుగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. క్రూషియల్ టైంలో తమ బ్యానర్ కు ఇలాంటి సక్సెస్ వచ్చిందని అన్నారు.
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకు ఈ సంక్రాంతి మిశ్రమ ఫలితాలను అందించింది. ఆయన బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిస్తే, లిమిటెడ్ పెట్టుబడితో తీసిన మూవీ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. రిలీజ్ కు ముందు ఈ పండక్కి రెండు సిక్సర్లు కొట్టడం ఖాయని ధీమా వ్యక్తం చేసారు కానీ, చివరకు ఒక్క సిక్స్ మాత్రమే కొట్టగలిగారు. దీంతో వచ్చిన సక్సెస్ ను కూడా దిల్ రాజు మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.
దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సినిమా 'గేమ్ ఛేంజర్'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మక 50వ చిత్రం ఇది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూడున్నర ఏళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ మూవీ మేకింగ్, రెమ్యునరేషన్స్, ఇంటరెస్టులు, ప్రమోషన్స్.. అన్నీ కలుపుకొని 400 - 500 కోట్ల దాకా ఖర్చు అయినట్లుగా టాక్ వుంది. సంక్రాంతి లాంటి మంచి సీజన్ దొరకడంతో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని భావించారు. కానీ ఫలితం మాత్రం వేరేలా వచ్చింది.
మరోవైపు విక్టరీ వెంకటేశ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందించి 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘన విజయం సాధించింది. 72 రోజుల్లో మీడియం బడ్జెట్ తో తీసిన ఈ చిత్రం.. 4 రోజుల్లోనే 130 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ట్రెండ్ చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు కానీ, ‘గేమ్ ఛేంజర్’ కారణంగా దిల్ రాజు ఆ విజయాన్ని పూర్తిస్థాయిలో ఆనందించలేకపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రీసెంట్ ఈవెంట్ లో నిర్మాత పరధ్యానంగా కూర్చొని, ఏదో ఆలోచిస్తున్నట్లు ఉన్న వీడియోని షేర్ చేస్తున్నారు.
'గేమ్ ఛేంజర్' రిలీజ్ కు ముందు ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. సక్సెస్ లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేమన్నారు. కోవిడ్ తర్వాత ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని, బయట కొందరు వ్యక్తులు మాట్లాడిన మాటలు విని ఎంతో భయపడ్డానని చెప్పారు. యూనివర్సల్‌గా సక్సెస్ అందుకోలేకపోయానని, ఈ సినిమాతో ఆ లోటు తీరుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కానీ ఎంతో ప్రత్యేకంగా భావించిన సినిమా బాగా డిజప్పాయింట్ చేసింది.
లేటెస్టుగా 'సంక్రాంతికి వస్తున్నాం' ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. క్రూషియల్ టైంలో తమ బ్యానర్ కు ఇలాంటి సక్సెస్ వచ్చిందని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ గా 'పెళ్లి పందిరి', ప్రొడ్యూసర్ గా 'ఆర్య' సినిమాలు ఎంత కిక్ ఇచ్చాయో.. ఇప్పుడు తమ 58వ సినిమాతో ఊహించని అద్భుతం జరిగిందని పేర్కొన్నారు. "మేము బావిలో పడిపోతున్నామని ఎంతోమంది సంతోష పడేలోపు.. అనిల్ ఈ సినిమాతో మమ్మల్ని పైకి తీసుకొచ్చి ఇవాళ వారి పక్కన నిలబెట్టాడు'' అని నిర్మాత శిరీష్ అన్నారు.
గత రెండు దశాబ్దాలుగా సినిమా నిర్మాణంలో ఉన్న దిల్ రాజు, శిరీష్.. ఎప్పుడూ ఒక వేదిక మీద ఈ విధంగా మాట్లాడలేదు. క్రూషియల్ టైంలో తమ బ్యానర్ కు ఇలాంటి ఒక సక్సెస్ వచ్చిందని ఎమోషనల్ గా మాట్లాడింది లేదు. బోలెడన్ని ఆశలు పెట్టుకున్న 'గేమ్ ఛేంజర్' దెబ్బ కొట్టినా, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాతలకు రిలీఫ్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే, సంక్రాంతికి పార్టీలో దిల్ రాజు డ్యాన్స్ చేశారని మరికొందరు అంటున్నారు.