ఆ హీరోతో ఒక సినిమా పక్కా: కొరటాల శివ

కొరటాల శివ, ఆచార్య ముందు వరకు కూడా టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరికి మంచి గుర్తింపును అందుకున్న వారే.

Update: 2024-09-26 15:54 GMT

కొరటాల శివ, ఆచార్య ముందు వరకు కూడా టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరికి మంచి గుర్తింపును అందుకున్న వారే. ఎప్పుడైతే ఆచార్యతో ఫ్లాప్ పడిందో ఆ తరువాత ఆయన మేకింగ్ మీద కామెంట్స్ మొదలయ్యాయి. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లతో పనిచేసి బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నప్పటికి ఆ ఒక్క మెగా సినిమా ఆయనకు మర్చిపోలేని మచ్చ మిగిల్చింది.

ఇక ఇప్పుడు దేవర తో సక్సెస్ అందుకుంటే గాని కొరటాల శివకు మళ్ళీ పెద్ద హీరోలు డేట్స్ ఇచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది. నిజానికి ఆచార్య అనంతరం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్టవలేదు. కొరటాల శివ, బన్నీ కలయికలో లాంచ్ అయిన ఒక సినిమా మధ్యలోనే ఆగిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదలైనా, ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

అయితే, కొరటాల శివ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ, అల్లు అర్జున్‌తో ఒక సినిమా త్వ‌రలోనే వ‌చ్చే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. మిర్చి సినిమాను బన్నీ తన కుటుంబంతో కలిసి చూసి ఎంతో ఎంజాయ్ చేశాడని, అప్పటి నుంచే తనతో సినిమా చేయాలని అనుకుంటున్నాడని తెలిపారు. కొన్ని కారణాల వల్ల అప్పటి ప్రాజెక్ట్ ఆగిపోయినా, తనతో బన్నీ కలిసి ఓ సినిమా చేయాలన్నది ఇంకా బలమైన అభిలాషగా ఉందని చెప్పారు.

ఇక, ప్రస్తుతం దేవర సినిమా గురించి వస్తున్న పుకార్లపై కూడా కొరటాల క్లారిటీ ఇచ్చారు. బయట వ్యక్తులు సినిమా చూసి రివ్యూలు ఇచ్చారనే వార్తలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. ఇప్పటి వరకు సినిమా కేవలం తారక్, కొరటాల, యూనిట్ సభ్యులు, వారి కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే ప్రదర్శించబడిందని, ఇతరులు సినిమా చూడలేదు అని అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్‌కు దేవర సినిమా ఎంతగానో నచ్చిందని, ఆయనకు ఎప్పుడైనా ఏదైనా నచ్చకపోతే, అది వెంటనే తెలిసిపోతుందని కొరటాల పేర్కొన్నారు. తారక్ మనస్తత్వం ఎలా ఉంటుందంటే.. ఏదీ దాచుకోకుండా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. దేవర సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాము.. ఈ సినిమాలో ఎమోషన్స్, యాక్షన్, డ్రామా అన్నీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయని కొరటాల శివ ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News