డ్రగ్స్ కేసు.. సెప్టెంబర్ 23న ఏం జరుగుతుందో?

నవదీప్ విచారణ నుంచి తప్పించుకోవడానికి, పోలీసుల ముందు హాజరుకాకపోతే మాత్రం అతడిని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకుంటున్నారు.

Update: 2023-09-22 11:59 GMT

మాదాపూర్ డ్రగ్స్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో.. సెక్షన్ 41A Cr PC కింద హీరో నవదీప్‌కు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు నోటీసులు పంపడం వల్ల కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. చిత్రసీమలో ఇప్పుడీ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 23న నవదీప్ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఈ కేసు మరింత తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు మరింత మలుపు తిరుగొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అరెస్ట్ వంటి రూమర్స్ టాలీవుడ్​లో కలకలం రేపుతున్నాయి.

ఎందుకంటే.. నార్కోటిక్స్ బ్యూరో సమన్లను ​​పంపించిన నేపథ్యంలో.. నవదీప్ విచారణ నుంచి తప్పించుకోవడానికి, పోలీసుల ముందు హాజరుకాకపోతే మాత్రం అతడిని అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ మాదక ద్రవ్యాల కేసులో అతడి పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడిని విచారించి ఏదైనా సమాచారం లాగాలని అధికారులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు నవదీప్ ఇప్పటికే తన ట్విట్టర్ స్టేట్‌మెంట్‌లతో పాటు బెయిల్ కోసం అప్లై చేసి రిజెక్ట్​కు గురి అవ్వడం, విచారణకు హాజరుకాకుండా ఉండేందుకు గట్టిగా ప్రయత్నాలు చేయడం వంటి అందరిలో మరింత సందేహాలకు దారి తీస్తోంది.

కేసులో నవదీప్ హస్తం ఏమైనా ఉండి ఉంటుందా, అతడు మాదక ద్రవ్యాలను తీసుకుని ఉండొచ్చేమోనని కూడా కొంతమందికి అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి. ఒకవేళ నిజంగానే అతడికి డ్రగ్స్ కేసులో లింకులు ఉన్నాయని తేలితే మాత్రం, నవదీప్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అసలే గతంలో హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో భాగంగా.. మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు పూరీ జగన్నాథ్, యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఛార్మి, నాజూకు బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు సినీ తారలు విచారణ ఎదుర్కోవడంతో టాలీవుడ్​లో పెద్ద కలకలమే రేగింది. ఇప్పుడు నవదీప్ పేరు బయటకు రావడంతో అది మరింత సెన్సేషనల్ గా మారింది. పోలీసులు త్వరలోనే కేసుకు సంబంధించి ఇతర సెలబ్రిటీలను కూడా పిలిచే అవకాశం ఉందనే ప్రచారంతో ప్రస్తుతం టాలీవుడ్​లో ఆందోళన కనిపిస్తోంది.

కానీ ఇప్పటి వరకు ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి తెలుగు చిత్రసీమలో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఒకవేళ అలాంటి కనుక ఏమైనా జరిగితే.. ఉన్నత స్థాయికి ఎదుగుతున్న సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఇది మంచిది కాదనే చెప్పాలి. ఇది ఓ ప్రతిష్టాత్మక సమస్యగా మారుతుంది. చూడాలి మరి శనివారం(సెప్టెంబర్ 23) ఏం జరుగుతుందో, అసలు నవదీప్ పోలీసుల ముందు హాజరవుతారో లోదే, ఒకవేళ అయితే విచారణలో ఆయన ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోని ఏం సమాధానాలు చెబుతారో.. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి నవదీప్ అయితే.. ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రముఖ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది.

Tags:    

Similar News